What happens to a person after death: ఒక మనిషి చనిపోయిన తరువాత వారికి ఏం జరుగుతుంది? ఇది చాన్నాళ్లుగా చాలామందిని వేధిస్తోన్న ప్రశ్న. శనివారం ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ఒక 17 ఏళ్ల యువకుడు సూసైడ్ చేసుకున్నారు. తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఆ యువకుడికి చనిపోయే ముందు ఇదే డౌట్ వచ్చింది. చనిపోయిన తరువాత మనిషికి ఏం జరుగుతుంది అని ఆ యువకుడు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు కారణం ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని మాత్రం కాదు. 9వ తరగతి చదువుతున్న ఆ టీనేజ్ కుర్రాడి ఆత్మహత్య వెనుక వేరే కారణం ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆ టీనేజ్ కుర్రాడి తల్లి మీరట్ మెడికల్ కాలేజీలో నర్సుగా పనిచేస్తున్నారు. తండ్రి గతేడాది చనిపోయారు. సోదరుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. అయితే, ఈ కుర్రాడు చదువు మీద దృష్టి సారించకుండా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ వేసుకుని స్నేహితులతో తిరుగుతున్నాడని ఇంట్లో తల్లి, సోదరుడు మందలించారు. అయినప్పటికీ తమ అబ్బాయి తీరులో మార్పు రాలేదని, దీంతో ఆ బైక్ అమ్మేస్తే కానీ మారడనే ఉద్దేశంతో బైక్ అమ్మేశామని చెప్పారు. అయితే, ఆ బైక్ అమ్మేశామనే కోపంలోనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నారని ఆ టీనేజ్ కుర్రాడి తల్లి చెప్పారు.
శనివారం సాయంత్రం ఆ కుర్రాడి సోదరుడు తమ తల్లిని డ్యూటీ నుండి ఇంటికి పికప్ చేసుకోవడానికి వెళ్లారు. వారు ఇంటికి వచ్చేసరికి లోపలి నుండి తలుపులు వేసి ఉన్నాయి. ఇంట్లో నుండి పెద్దపెద్దగా అరుస్తున్న శబ్ధాలు వినబడుతుండటంతో కిటికీ పగలకొట్టి అందులోంచి వెళ్లి చూసేటప్పటికి ఆ కుర్రాడు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే ఆ అబ్బాయి చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు.
బైక్ అమ్మేశామనే కోపంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్న కుటుంబసభ్యులు ఈ విషయంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, పోలీసులు మాత్రం ఆ కుర్రాడి చేతికి .315 బోర్ నాటు తుపాకీ ఎలా వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు.