TOP 6 News @ 6PM:మహాకుంభమేళాకు హాజరైన స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ కు అస్వస్థత.. మరో 5 ముఖ్యాంశాలు
యాపిల్ కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు.
1.శబరిమలలో భక్తులకు దర్శనమిచ్చిన మకరజ్యోతి
శబరిమలలో భక్తులకు జనవరి 14న మంగళవారం మకరజ్యోతి కనిపించింది. పొన్నాంబలమేడు నుంచి భక్తులకు మకరజ్యోతి దర్శనమైంది. మకరజ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనమిచ్చారని భక్తుల విశ్వాసం. అయ్యప్పస్వామికి తిరువాభరణ ఘట్టం పూర్తయ్యాక పొన్నాంబలమేడు పర్వత శిఖరాల్లో మకరజ్యోతి దర్శనమిచ్చింది.
2.మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ కు అస్వస్థత
దివంగత స్టీవ్ జాబ్స్ భార్య లారీన్ పావెల్ జాబ్స్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరయ్యారు. ఈ సమయంలో ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి కైలాసాంద గిరి మహరాజ్ తెలిపారు. మహాకుంభమేళా వద్ద ఏర్పాటు చేసిన హెల్త్ శిబిరం వద్ద ఆమె చికిత్స తీసుకుంటున్నారు.భారత్ లో ఆమె పర్యటించడం ఇది రెండోసారి. కుంభమేళా ప్రారంభం రోజున 1.65 కోట్ల మంది భక్తులు హాజరయ్యారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
3.నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం దిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు బోర్డును ఏర్పాటు చేసింది కేంద్రం. పసుపు బోర్డు ఛైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించారు. పసుపు బోర్డు కోసం 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రైతులు ఆందోళన చేశారు. ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ సమయంలో పసుపుబోర్డు ఏర్పాటుకు బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అరవింద్ హామీ ఇచ్చారు.
4కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కల్లక్కడల్ ముప్పు: కేంద్రం వార్నింగ్
కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు వార్నింగ్ ఇచ్చింది. జనవరి 15 రాత్రి సముద్రంలో ఉప్పెన వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రతీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా వాతావరణ శాఖ కోరింది.
5.వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరగాలి:చంద్రబాబు
సాగు విధానంలో మార్పులు వస్తున్నాయని వీటికి అనుగుణంగా సేద్యం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులను కోరారు.
నారావారిపల్లెలోని నైపుణ్యాభివృద్ది శిక్షణ కేంద్రంలో గ్రామాల అభివృద్దిపై కార్యకర్తలపై సీఎం సమావేశమయ్యారు. ప్రకృతి సేద్యం వైపు ప్రపంచం చూస్తోందని ఆయన అన్నారు. సేంద్రీయ సాగును మరింత ప్రోత్సహిస్తామన్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
6. దిల్లీకి రేవంత్ రెడ్డి:మంత్రివర్గ విస్తరణపై చర్చించే ఛాన్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం దిల్లీకి వెళ్లారు. ఆయనతో పాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులు, పార్టీ సీనియర్లున్నారు. ఎఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన దిల్లీ వెళ్లారు. పార్టీ సీనియర్లతో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది.దీంతో పాటు నామినేటేడ్ పోస్టుల భర్తీపై కూడా ఆయన పార్టీ నాయకులతో చర్చించనున్నారు