China: జిన్‌పింగ్‌ శకం ముగిసిందా?

China: జీరో కోవిడ్‌ విధానంతో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో చైనా దారుణంగా విఫలమైంది.

Update: 2022-05-15 12:30 GMT

China: జిన్‌పింగ్‌ శకం ముగిసిందా?

China: జీరో కోవిడ్‌ విధానంతో వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో చైనా దారుణంగా విఫలమైంది. బీజింగ్‌, షాంఘై, జిలిన్‌ ప్రావిన్సుల్లో నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కరోనాను వ్యాప్తిని అడ్డుకోవడంలో దేశాధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ విఫ‌ల‌మైన‌ట్లు ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. లాంగ్‌ లాక్‌డౌన్‌తో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ భారీగా పతనమైంది. ఈ నేప‌థ్యంలో జీ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌స్తుతం చైనీస్ సోష‌ల్ మీడియాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రస్తుత చైనా ప్రధాని లీ కీక్వాంగ్‌కు అప్పగించనున్నట్టు ఓ బ్లాగర్‌ చేసిన వీడియో చైనాలో ఇప్పుడు విపరీతమైన వైరల్‌ అవుతోంది.

చైనాలో ఇటీవల చైనీస్‌ కమ్యూనిస్‌ పార్టీ-సీసీపీ పోలిట్‌ బ్యూరో స్టాండింగ్‌ కమిటీ సమావేశమైంది. దేశంలోని ప్రస్తుత కోవిడ్‌ సంక్షోభం, ఆర్థిక పరిస్థితులపై భేటీలో చర్చించనట్టు తెలుస్తోంది. ఈ స్టాండింగ్‌ కమిటీ సమావేశం తరువాత చైనాలో జిన్‌పింగ్‌ రాజీనామాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇటీవల ఆయన మెదడకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారంటూ వార్తలు వచ్చిన రెండ్రోజులకే జిన్‌పింగ్‌ తప్పకుంటాడంటూ సోషల్‌ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అధ్యక్ష బాధ్యతల నుంచి జిన్‌పింగ్‌ను చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ తప్పించనున్నట్టు కెనడాకు చెందిన ఓ బ్లాగర్‌ చేసిన వీడియో ఇప్పుడు చైనాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. జిన్‌పింగ్‌ స్థానంలో ప్రస్తుత చైనా ప్రధాని లీ కీక్వాంగ్‌ అధ్యక్ష బాధ్యతలను చేపడుతారని కెనడా బ్లాగర్ తన వీడియోలో పేర్కొన్నారు. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీని, ప్రభుత్వాన్ని కూడా లీ కీక్వాంగ్‌ నడపనున్నట్టు వీడియోలో వెల్లడించారు.

ఈ ఏడాది మార్చి నుంచి చైనా ఆర్థిక రాజధాని షాంఘైను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికించింది. వేలాది మంది వైరస్‌ బారిన పడ్డారు. దీంతో చైనా ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్‌ను అమలుచేసింది. దీంతో రెండు నెలల పాటు ప్రజలు లాక్‌డౌన్‌లో మగ్గిపోయారు. ఆహారం అందక ఆకలితో అల్లాడిపోయారు. మరోవైపు మందుల కొరత వేధించింది. పొరపాటున ప్రజలు బయటకు వస్తే పోలీసులు దాడులు చేశారు. భారీ ఎత్తున కోవిడ్‌ పరీక్షలను చైనా ప్రభుత్వం నిర్వహించింది. లక్షణాలు ఉన్నవారిని జిన్‌పింగ్‌ ప్రభుత్వం బలవంతంగా క్వారంటైన్‌ కేంద్రాల్లోకి పంపింది. కోవిడ్‌ కంటే క్వారంటైన్‌కే చైనీయులు ఎక్కువగా భయపడ్డారు. కోవిడ్‌ కట్టడికి చైనా అనుసరిస్తున్న విధానాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం పట్టించుకోలేదు. నెలల తరబడి లాక్‌డౌన్‌ విధించడంతో ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తవుతోంది. అదే సమయంలో లాక్‌డౌన్‌ కారణంగా పరిశ్రమలు మూతపడ్డాయి. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఫలితంగా చైనా ప్రభుత్వం భారీ నష్టాలు మూటగట్టుకున్నది.

జీరో కోవిడ్‌ పాలసీతో ఆర్థిక‌, సామాజిక వృద్ధికి అడ్డుగా నిలుస్తోంద‌ని ఓ చైనా అధికారి తెలిపారు. శాస్త్రీయ ప‌ద్ధతిలో మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాల‌ని, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స్థిరీక‌రించాల‌ని, ఒకే ర‌క‌మైన టార్గెట్ ఉండ‌కూడ‌ద‌ని క‌మ్యూనిస్టు పార్టీ సెంట్ర‌ల్ క‌మిటీ డిప్యూటీ డైరెక్ట‌ర్ హ‌న్ వెన్‌జియూ అన్నారు. క‌ఠిన కోవిడ్ ఆంక్ష‌లతో ప‌రిశ్ర‌మల ఉత్ప‌త్తి త‌గ్గింద‌ని, దీంతో స‌ప్ల‌య్ చెయిన్ దెబ్బ‌తిన్న‌ట్లు నిపుణులు చెబుతున్నారు. త‌యారీరంగ ప‌రిశ్ర‌మ‌లు క్షీణిస్తున్నాయ‌ని, 2020 ఫిబ్ర‌వ‌రి త‌ర్వాత కంపెనీలు డీలాప‌డ్డ‌ట్లు భావిస్తున్నారు. ఇటీవల సప్లయ్‌ చైన్‌ దెబ్బతినడంతో అవసరమైన ముడి సరుకులు అందక చైనాలోని తమ యూనిట్‌ను మూసేస్తున్నట్టు ఇటీవల ఎలక్ట్రిక్‌ కార్ల సంస్థ టెస్లా ప్రకటించింది. ఏప్రిల్‌లో చైనా క‌రెన్సీ విలువ 4 శాతం త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన 28 ఏళ్ల‌లో ఇంత‌గా ప‌డిపోవ‌డం ఇదే మొద‌టిసారి. స్టాక్ మార్కెట్లు కూడా పేల‌వంగా ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కోవిడ్‌, లాక్‌డౌన్‌, ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడంతో చైనా ప్ర‌జ‌ల్లో అసంతృప్తి తీవ్రమైంది. దీంతో జిన్‌పింగ్ పాల‌న‌పై ప్రజలు న‌మ్మ‌కం కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో జిన్‌పింగ్ అధ్యక్ష‌ బాధ్య‌త‌ల నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు పుకార్లు వ్యాపిస్తున్నాయి. గతేడాది చివర్లో ఆసుపత్రి పాలైన జీ సెరిబ్రల్‌ అనైరిజమ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు కథనాలు వెలువుడుతున్నాయి. రెండేళ్ల క్రితం కరోనా వైరస్‌ బయటపడినప్పటి నుంచి ఇటీవల ముగిసిన బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్ వరకు విదేశీ నేతలతో జిన్‌పింగ్‌ అస్సలు కలవనేలేదు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలోనూ జీ బయటకు వచ్చిన సందర్భాలు కూడా లేవు. కేవలం రష్యా విదేశాంగ శాఖ మంత్రి మాత్రం పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. చైనా అధ్యక్షుడు మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారు. దీంతో ఆయన వ్యాధిబారిన పడినట్టు వస్తున్న కథనాలకు బలం చేకూరుతోంది. సాధారణంగా సెరిబ్రల్‌ అనైరిజమ్‌ అనే వ్యాధి సోకితే శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. కానీ జిన్‌పింగ్‌ మాత్రం సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాధిని నయం చేసుకోవడానికి యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే చైనా అధ్య్షక్షుడు బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నారట. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అనారోగ్యం, ఆయన రాజీనామాపై ఇటీవల ప్రచారం ఊపందుకుంది. అయితే చైనా నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి సమాచారం వెలువడలేదు. కనీసం ఈ ప్రచారాలను ఖండిస్తూ కూడా బీజింగ్‌ వర్గాలు స్పందించడం లేదు. 

Tags:    

Similar News