Russia Ukraine War: అణ్వాయుధాలు వదులుకుని మోసపోయిన ఉక్రెయిన్‌..

Russia Ukraine war: పుట్టుకతోనే ప్రపంచాన్ని వణికించే అణ్వాయుధాలను మెడలో వేసుకున్న దేశమది

Update: 2022-02-25 07:54 GMT

Russia Ukraine War: అణ్వాయుధాలు వదులుకుని మోసపోయిన ఉక్రెయిన్‌..

Russia Ukraine war: పుట్టుకతోనే ప్రపంచాన్ని వణికించే అణ్వాయుధాలను మెడలో వేసుకున్న దేశమది అమెరికా, రష్యా తరువాత అణ్వాయుధాలను కలిగి ఉన్న మూడో దేశం.. కానీ.. ఇప్పుడు ఆత్మ రక్షణ కోసం నిస్సహాయంగా విలపిస్తోంది. ప్రపంచ దేశాలను నమ్మి.. అణ్వాయుధాలను వదులుకుని.. నేడు కుమిలిపోతోంది.. నాడు చిలకపలుకులు వల్లించిన దేశాలు కష్ట సమయంలో ఒక్కటి కూడా సాయమందించకపోవడంతో విలవిలలాడుతోంది.

సోవియట్‌ యూనియన్ పతనం తరువాత స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఉక్రెయిన్‌కు నాటి రష్యా నుంచి వారసత్వంగా 5వేలకు పైగా అణ్వస్త్రాలు లభించాయి. సోవియట్‌ యూనియన్‌కు చెందిన రాకెట్ ఆర్మీ, నాలుగు రాకెట్‌ డివిజన్లు ఉక్రెయిన్‌లో ఉన్నాయి. 175 ఖండాంతర క్షిపణులను ఉక్రెయిన్‌ భూగర్భంలో సోవియట్‌ దాచింది. 33 హెవీ బాంబర్లు, ఎస్‌ఎస్‌24 క్షిపణులు ఆ దేశ అమ్ముల పొదిలో ఉండేవి. అమెరికా, రష్యా తరువాత ప్రపంచంలో అత్యధికంగా అణ్వాయుధాలను కలిగి ఉన్న దేశం ఉక్రెయిన్.

అయితే అణ్వాయుధాలను నిర్వీర్యం చేయించేందుకు ఉక్రెయిన్‌తో బ్రిటన్‌, రష్యా, అమెరికా చర్చలు జరిపాయి. అణు నిరాయిధీకరణపై ఈ నాలుగు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చినట్టు 1994 జనవరి 10న అమెరికా అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ ప్రకటించారు. ఆమేరకు 1994 డిసెంబరు 5న హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో ఒప్పందం చేసుకున్నారు. దీన్నే బుడాపెస్ట్‌ ఒప్పందం అని అంటారు. ఈ ఒప్పందంలో భాగంగా ఉక్రెయిన్‌ తన అణ్వాయుధాలను నిర్వీర్యం చేయాలి. అందుకు ప్రతిఫలంగా ఉక్రెయిన్‌ సార్వభౌమత్వానికి, నాటి హద్దులను గుర్తించాడానికి నాలుగు దేశాలు అంగీకరించాయి.

ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా ఏ దేశం కూడా సైనిక శక్తిని ప్రయోగించకూడుదు. ఈ ఒప్పందాన్ని వెంటనే అమలు చేసేలా ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. వీటన్నింటిని నమ్మిన ఉక్రెయిన్.. 1996 నాటికి తన వద్ద ఉన్న చివరి అణ్వాయుధాన్ని కూడా రష్యాకు అప్పటించింది. కానీ రష్యాకు అధ్యక్షుడిగా బోరిస్‌ ఎల్సిన్‌ తరువాత పుతిన్‌ అధికారం చేపట్టారు. నాటి నుంచి పరిస్థితులు మారుతూ వచ్చాయి. ఉక్రెయిన్‌లో ప్రభుత్వాలు తమ చేతిలో కీలుబొమ్మగా ఉండేలా రష్యా కుట్రలు పన్నుతూ వచ్చింది. 2010 తరువాత ఉక్రెయినన్‌పై రష్యా పట్టు పెరిగింది. అయితే 2014లో క్రిమియాను ఆక్రమించడంతో పాటు రష్యా తిరుగుబాటుదారులను ప్రోత్సహించింది.

నాటో సభ్యత్వం కావాలంటూ కొన్నేళ్లుగా ఉక్రెయిన్ వేడుకుంటున్నా.. అమెరికా సహకరించలేదు. నాటో సభ్యత్వం రాకుండా అడ్డుకునేందుకు ప్రాన్స్‌, జర్మనీ చేసిన ప్రయత్నాలను అమెరికా అడ్డుకోలేదు. పుతిన్‌ యుద్ధసన్నాహాలు చేస్తున్న సమయంలోనూ ఉక్రెయిన్‌కు తమ దళాలను పంపమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ముందే ప్రకటించాడు. అంతేకాదు రష్యా దాడికి దిగిన తరువాత కూడా బ్రిటన్‌, అమెరికా ఆంక్షలతోనే సరిపెట్టాయి. దీంతో రష్యా రెచ్చిపోయింది. నాటి అణ్వాయుధాలను వదులుకుని ఉక్రెయిన్‌ నిస్సహాయంగా మిలిగిపోయింది. ప్రపంచ దేశాల శాంతి బోధనలు విని.. అణ్వాయుధాలను వదులుకున్నందుకు ఉక్రెయిన్‌ పశ్చాత్తాపపడుతోంది. 

Tags:    

Similar News