AstraZeneca: కోవిడ్-19 వ్యాక్సీన్‌లను ఆస్ట్రాజెనెకా ఎందుకు వెనక్కి తీసుకుంటోంది?
AstraZeneca: దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోనున్న కోవిడ్-19 వ్యాక్సీన్లను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేసింది.
AstraZeneca: దిగ్గజ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోనున్న కోవిడ్-19 వ్యాక్సీన్లను వెనక్కి తీసుకుంటామని ప్రకటన చేసింది. కరోనావైరస్ వ్యాప్తి సమయంలో భారత్‌తోపాటు చాలా దేశాల్లో ప్రజలు ఎక్కువగా తీసుకున్న టీకాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో ఈ వ్యాక్సీన్లను వరుసపెట్టి వివాదాలు, కేసులు చుట్టు ముడుతున్నాయి. ఇంతకీ అసలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లను ఎందుకు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది, దీని ప్రభావం భారత్‌లో ఎలా ఉంటుంది?
అసలు ఆస్ట్రాజెనెకా ఏం చెప్పింది?
కోవిడ్-19 కొత్త వేరియంట్లపై పనిచేసే అప్‌డేట్ వ్యాక్సీన్లు మార్కెట్లో చాలా ఉన్నాయని, అందుకే మొదటి వేరియంట్‌ను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేసిన తమ వ్యాక్సీన్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటున్నామని తాజాగా ఆస్ట్రాజెనెకా ప్రకటన చేసింది.
నిజానికి మార్చ్‌లోనే యూరోపియన్ యూనియన్‌లో ‘మార్కెటింగ్ ఆథరైజేషన్’ను ఆస్ట్రాజెనెకా ఉపసంహరించుకుంది. అంటే యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలకు ఈ టీకాను విక్రయించడానికి కంపెనీకి అవకాశం లేనట్టే.
తాజా నిర్ణయాన్ని పూర్తి బిజినెస్ నిర్ణయంగా ఆస్ట్రాజెనెకా చెబుతోంది. ఇప్పటికే అమ్మకాలు పడిపోవడంతోపాటు కొత్త వేరియంట్లపై పనిచేసే వ్యాక్సీన్లు అందుబాటులో ఉండటంతో పాతవి వెనక్కి తీసుకుంటున్నామని సంస్థ చెబుతోది.
అయితే, ఈ వ్యాక్సీన్ దుష్ప్రభావాలపై వివాదాలు నడుస్తున్న సమయంలోనే తాజా నిర్ణయం తీసుకోవడంతో చాలా రకాల విశ్లేషణలు వస్తున్నాయి. దుష్ప్రభావాల వల్లే వ్యాక్సీన్లను వెనక్కి తీసుకుంటున్నారని కొన్ని మీడియా సంస్థలు వార్తలు కూడా ప్రచురించాయి.
భారత్‌లో 175 కోట్ల డోసులు..
ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ పేరు వ్యాక్స్‌జేవ్‌రియా. దీన్నే భారత్‌లో కోవీషిల్డ్ పేరుతో ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసింది. భారత్‌లో దీన్ని పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేస్తోంది.
ఒక్క భారత్‌లోనే 175 కోట్ల డోసులను ప్రజలకు ఇచ్చారు. అంటే ఇక్కడ దాదాపు 90 శాతం మంది ఇదే వ్యాక్సీన్‌ను తీసుకున్నారు.
అయితే, గత ఏప్రిల్‌లో బ్రిటన్‌లోని ఒక కోర్టులో ‘కోవిడ్-19 వ్యాక్సీన్‌తో చాలా అరుదుగా టీటీఎస్ వచ్చే అవకాశముంటుంది’’ అని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది.
థ్రోంబోసిస్ విత్ థ్రోంబోసైటోపేనియా సిండ్రోమ్‌నే టీటీఎస్‌గా పిలుస్తారు. ఇది వచ్చేటప్పుడు రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పడిపోతుంది. రక్తం గడ్డలు కడుతుంది కూడా.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, తల నొప్పి లాంటి లక్షణాలు టీటీఎస్‌లో కనిపిస్తాయి.
అయితే, ఈ గడ్డలు రక్తం గుండా గుండె వరకూ చేరితే గుండె పోటు, మెదడులోకి చేరితే పక్షవాతం లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది.
ఈ వ్యాక్సీన్ తీసుకోవడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, రక్త స్రావం కూడా అవుతోందని చెబుతూ జేమీ స్కాట్ అనే వ్యక్తితోపాటు మరో 50 మందికిపై దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణలో చాలా అరుదుగా టీటీఎస్ జరగొచ్చని ఆస్ట్రాజెనెకా అంగీకరించింది.
భారత్‌లోనూ ఆస్ట్రాజెనెకాతోపాటు సీరం ఇన్‌స్టిట్యూట్‌లకు వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలయ్యాయి.
మరి టీకా వేసుకున్న వారి సంగతేంటి?
రక్తం గడ్డకడుతుందని చెప్పే వార్తలు, కోర్టు కేసుల నడుమ ఇప్పటికే ఈ వ్యాక్సీన్ తీసుకున్న వారిలో భయం పెరిగిందని, కొందరైతే పరీక్షలు కూడా చేయించుకునేందుకు హాస్పిటల్‌కు వస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఈ విషయంలో ప్రజలు భయపడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కో-చైర్మన్ డాక్టర్ సంజీవ్ జయదేవన్ ‘ద హిందూ’ వార్తా పత్రికతో చెప్పారు.
‘‘చాలా అరుదుగా టీటీఎస్ వచ్చే అవకాశం ఉంటుందని బ్రిటన్ కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించడంలో మాకు కొత్త అంశమేమీ కనిపించలేదు. నిజానికి కోవిడ్-19 వైరస్‌తోనే రక్తం గడ్డకట్టడం, గుండె పోటు, పక్షవాతం లాంటి అనారోగ్య ముప్పులు రావచ్చు. ఇవి ఇన్ఫెక్షన్ సమయంలోనైనా లేదా ఆ తర్వాతైనా రావచ్చు. దీనికి వ్యాక్సీనే కారణమని చెప్పలేం’’ అని ఆయన చెప్పారు.
‘‘అందుకే కోర్టులో ఆస్ట్రాజెనెకా అంగీకరించిన విషయం కొత్తగా అనిపించలేదు. చాలా చాలా అరుదుగా ఇలాంటివి జరగొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశీలనలోనూ తేలింది. ఇక్కడ చాలా చాలా అరుదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి’’ అని ఆయన అన్నారు.
రక్తం గడ్డకట్టడమనే అంశం గురించి ఇప్పుడు ఆందోళన అసలు పడాల్సిన అవసరంలేదని సంజీవ్ చెప్పారు.
‘‘మీరు తొలి డోసు వ్యాక్సీన్ తీసుకున్నప్పుడో లేదా వ్యాక్సీన్ వేసుకున్న తొలి నెలలోనో రక్తం గడ్డకట్టడం గురించి కొంచెం భయపడినా అర్థం వుంటుంది. ఎందుకంటే ఆ సమయంలో ముప్పు కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ, 2024లో భయపడి అర్థంలేదు. ఇప్పుడు టీటీఎస్ గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన చెప్పారు.
ఈ దుష్ప్రభావాలపై గతంలోనే సీరం ఇన్‌స్టిట్యూట్ ఒక నివేదిక విడుదల చేసింది. ఏడు కోట్ల మందిలో ఒకరికి మాత్రమే ఇలా జరిగే అవకాశం ఉండొచ్చని, అంటే ఇది చాలా అరుదని పేర్కొంది.
మరోవైపు ఈ అరుదైన సైడ్‌ఎఫెక్ట్స్‌పై గురించిన సమాచారం టీకా వ్యాక్సీన్ కవర్‌పై కూడా ఉంటుందని, దీన్ని మేం ఎక్కడా దాచిపెట్టలేదని సంస్థ అంటోంది.
అయితే, ప్రజల్లో ఆందోళన తొలగించేందుకు కోవీషిల్డ్ వ్యాక్సీన్ దుష్ప్రభావాలపై అధ్యయనం కోసం ఎయిమ్స్ నిపుణుల నేతృత్వంలో ఒక కమిటీ వేయాలని ఇటీవల భారత్‌లోని సుప్రీం కోర్టులో మరో పిటిషన్ కూడా దాఖలైంది.
మొత్తానికి అటు బ్రిటన్, ఇటు భారత్ కోర్టుల్లో ఈ వివాదం ఇప్పుడప్పుడే ఒక కొలిక్కివచ్చే సూచనలేమీ కనిపించడం లేదు.