WHO Issues Warning: రాబోయే రోజుల్లో డెల్టాప్లస్ ముప్పు తప్పదు
WHO Issues Warning: కరోనా సెకండ్‌వేవ్‌తో వణికిపోయిన ప్రపంచ దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రకంపనలు రేపుతోంది.
WHO Issues Warning: కరోనా సెకండ్‌వేవ్‌తో వణికిపోయిన ప్రపంచ దేశాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ ప్రకంపనలు రేపుతోంది. దీనికితోడు రాబోయే రోజుల్లో ముప్పు తప్పదంటూ WHO హెచ్చరికలు మరింత కల్లోలం రేపుతున్నాయి. ప్రస్తుతం డెల్టాప్లస్ 96దేశాలకు పాకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్ధ తెలిపింది. అయితే, చాలా దేశాల్లో డెల్టాప్లస్‌ను గుర్తించడం కష్టమవుతోందని, ఇంకా చాలా దేశాల్లో అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్ కేసులు ఉండి ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే డెల్టా వేరియంట్ ఉన్న దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, చాలా మంది ఆసుపత్రుల పాలవుతున్నారని చెప్పింది. రాబోయే రోజుల్లో ఇతర వేరియంట్లను డెల్టా అధిగమించేస్తుందని పేర్కొంది. వీకెండ్ రిపోర్ట్‌లో WHO స్పష్టం చేసింది.
మరోవైపు డెల్టా సహా ఇతర రకాల వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుత వ్యాక్సిన్‌లు పనిచేస్తాయని WHO స్పష్టం చేసింది. అయితే, వేరియంట్ల వ్యాప్తి పెరిగే కొద్దీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ దేశాలకు సూచించింది. ఇప్పటికీ చాలా దేశాల్లో టీకా కార్యక్రమం చాలా నిదానంగా సాగుతోందని, ఇలాంటి సందర్భంలో వేరియంట్ల ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వీలైనంత వేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని డబ్ల్యూహెచ్ వో సూచించింది.
ఇదిలాఉంటే ప్రస్తుతం 172 దేశాల్లో ఆల్ఫా వేరియంట్ ఉన్నట్లు తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్ధ 120 దేశాల్లో బీటా, 72 దేశాల్లో గామా వేరియంట్ వ్యాప్తి ఉన్నట్లు ప్రకటించింది. ఈ వారంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గుముఖం పట్టిందని రిపోర్ట్‌లో WHO పేర్కొంది. అయితే, మయన్మార్, ఇండోనేసియా, బంగ్లాదేశ్ లలో కేసుల పెరుగుదల ఎక్కువగా ఉందని చెప్పింది.