అమెరికా ఎలక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు ఇద్దరు గెలుపు తమదంటే తమది అని ప్రచారం చేసుకుంటున్నారు. ఓట్ల ఫలితాలు ఎలా ఉన్నా అగ్రరాజ్యపు పీఠంపై కూర్చునేదెవరో తేలటానికి సమయం పడుతుంది. నిజానికి ఇప్పుడు వచ్చే ఫలితాలేవీ అధికారికం కాదు. అధికారికంగా ఫలితాల వెల్లడించేందుకు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గడువుంది.
డిసెంబరు 14న ఎలక్టోరల్ కాలేజీ సమావేశం జరుగుతుంది. డిసెంబరు 8లోపు ఆయా రాష్ట్రాలు ఎలక్టోరల్ కాలేజీ సమావేశంలో పాల్గొనే తమ ఎలక్టర్లను డిసైడ్ చేసుకోవాలి. ఈ గడువునే సేఫ్ హార్బర్ గడువు అంటారు. మరి ఆ లోపు న్యాయస్థానాల్లో వివాదాలు తేలుతాయా లేదా అన్నది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
అయితే డిసెంబర్ 8 లోపు ఎన్నికల ప్రక్రియలో ఆటంకం వస్తే రాష్ట్ర ఎలక్టర్లను ఎన్నుకోలేని పరిస్థితి వస్తుంది. ఈ స్విచ్‌వేషన్‌లో ఆ రాష్ట్ర శాసనసభ / గవర్నర్ వారిని నామినేట్ చేసే అవకాశం ఉంది. డిసెంబరు 14న ఎలక్టోరల్ కాలేజీ వేసిన ఓట్లను జనవరి 6న అమెరికా ప్రతినిధుల సభ సమీక్షించి అధ్యక్ష, ఉపాధ్యక్షులను అధికారికంగా ప్రకటిస్తుంది.