Khalil Al Hayya: ఇజ్రాయెల్ దాడిలో కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు.. అయినా అతడి ఎటాక్ స్టైలే వేరు

Update: 2024-10-19 10:00 GMT

Who is Khalil Al Hayya: అది 2007 సంవత్సరం. పాలస్తీనాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అలా ఇజ్రాయెల్ బలగాలు చేసిన బాంబు దాడుల్లో అప్పటికే దాదాపు 4 వేల మందికిపైగా జనం చనిపోయారు. ఆనాటి ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనాకు చెందిన ఒక కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోయింది. కానీ ఆ కుటుంబంలో ఒక్కరు మాత్రం ప్రాణాలతో బతికిబయటపడ్డారు. ఆయనే ఖలీల్ అల్ హయ. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న వ్యక్తే ఆ ఖలీల్ అల్ హయ. పాలస్తీనాతో పాటు హమాస్ ఆయన్ని సింపుల్‌గా ఖలీల్ హయ అని పిలుచుకుంటుంది. హమాస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ యాహ్యా సిన్వార్ మృతి చెందిన తరువాత ఇప్పుడు అతడే హమాస్ సంస్థకు కొత్త చీఫ్ అయ్యారు.

పాలస్తీనాలో పాలు తాగే పిల్లల నుండి కురు వృద్ధులదాకా ఇజ్రాయెల్ అంటే నరనరాన ఆగ్రహావేశాలు నింపుకుని ఉంటారు. కొంచెం వయసొచ్చిందంటే చాలు.. చేతికి ఒక తుపాకీ ఇస్తే ఇజ్రాయెల్‌పై యుద్ధానికి వెళ్లడానికే సిద్ధంగా ఉంటారు. కానీ ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో ఖలీల్ హయ తన కుటుంబం మొత్తాన్ని పొట్టనపెట్టుకున్నప్పటికీ.. అతడి వైఖరి మాత్రం మిగతా వారి కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. హమాస్‌లో మిగతా కమాండర్స్ అందరూ ఇజ్రాయెల్‌తో యుద్ధానికి కాలు దువ్వుతున్న సమయంలోనూ.. హమాస్ తరపున కాల్పుల విరమణ ఒప్పందానికి చొరవ తీసుకున్న ఏకైక వ్యక్తి ఖలీల్.

ఖలీల్ ప్రత్యేకత ఏంటంటే..

2014 లో హమాస్ - ఇజ్రాయెల్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అతడి పాత్రే కీలకం. ఆవేశంతో ఊగిపోయే రకం కాకుండా ప్రాక్టికల్‌గా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే మనిషిగా ఖలీల్‌కి పేరుంది. దౌత్యపరమైన సంప్రదింపుల్లో ఖలీల్ దిట్ట అని అంటుంటారు. అవసరమైతే, అంతర్జాతీయ స్థాయిలో ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య మధ్యవర్తిత్వం చేసేవారితోనూ సత్సంబంధాలున్న వ్యక్తిగా ఖలీల్ పేరు చెబుతుంటారు.

అందుకే ఒకవేళ ఇజ్రాయెల్‌తో మళ్లీ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలన్నా.. లేదంటే రెండు దేశాల మధ్య శాంతిస్థాపన దిశగా ఏదైనా ముందడుగు వేయాలన్నా, అందుకు ఖలీల్ కరెక్ట్ పర్సన్ అనే అభిప్రాయం వ్యక్తమైంది. కాకపోతే ఖలీల్ కూడా హమాస్ చీఫ్‌గా వచ్చీ రావడంతోనే హమాస్ వైఖరేంటో గట్టిగానే బల్లగుద్దీ మరీ చెప్పారు. ఇజ్రాయెల్ తమ డిమాండ్లను ఒప్పుకునే వరకు తమ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వాసులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఇజ్రాయెల్ తీరు మారనంతవరకు ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుందని ఖలీల్ తేల్చిచెప్పేశారు.

ఇప్పటివరకు హమాస్‌ని ముందుండి నడిపించిన యాహ్యా సిన్వార్ ఇజ్రాయెల్ చేతిలో హతమవడంతో అతడి స్థానంలోకి ఈ ఖలీల్ హయ వచ్చారు. హమాస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత ఖలీల్ అల్ హయ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్ చేతిలో హత్యకు గురైన యాహ్యా సిన్వార్‌ని ఖలీల్ అమరవీరుడితో పోల్చారు. సిన్వార్ తన జీవితం మొత్తాన్ని పాలస్తీనా స్వేచ్ఛ కోసమే త్యాగం చేశారని గుర్తుచేసుకున్నారు. ఆయన తన తుదిశ్వాస వరకు దేశం కోసమే పోరాడారని తెలిపారు. పాలస్తినా గడ్డ కోసం పోరాడిన సిన్వార్, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా, ఎప్పటికీ అమరుడిగా నిలిచిపోతాడన్నారు.

సిన్వార్ గురించి ఖలీల్ తన సందేశాన్ని చదువుతూ.. యువకుడిగా ఉన్నప్పటి నుండే సిన్వార్ తుపాకీ పట్టుకున్నారన్నారు. ఇజ్రాయెల్‌పై దాడి కేసులో ఆ దేశం అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్నప్పుడు కూడా యాహ్యా సిన్వార్ తన పోరాటాన్ని ఆపలేదని ఖలీల్ గుర్తుచేసుకున్నారు. ఇజ్రాయెల్ జైలు నుండి విడుదలయ్యాక మరింత చురుకుగా పనిచేశారని పాలస్తీనాకు సిన్వార్ చేసిన సేవలను స్మరించుకున్నారు.

ఇజ్రాయెల్‌తో యుద్ధం విషయంలో ఖలీల్ వైఖరిదే

జెరుసలేం రాజధానిగా పాలస్తీనా దేశం తమ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే వరకు హమాస్ పోరాటం ఆగదని, అప్పటివరకు ఇజ్రాయెల్ నుండి తీసుకొచ్చిన బందీలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఖలీల్ స్పష్టంచేశారు. ఇప్పటివరకు కతార్‌లో ఉంటూ వచ్చిన ఆయన ఇకపై పాలస్తీనాకు తన స్థావరాన్ని మార్చనున్నారు. ఆయన గతంలోనే హమాస్ మిలిటరీ ఆపరేషన్స్‌లో కీలక పాత్ర పోషించారు. పాలస్తీనా రాజకీయాల్లోనూ ఖలీల్ హయాకు మంచి సంబంధాలున్నాయి. అందుకే పాలస్తీనా హక్కుల కోసం పోరాడుతున్న మిలిటెంట్ సంస్థగా పేరున్న హమాస్‌కి ఇప్పుడు ఖలీల్ హయ కొత్త బాస్ అయ్యారు.

ఖలీల్‌కి అమెరికా ఆహ్వానం పలుకుతుందా?

యాహ్యా సిన్వార్ మృతిపై అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు. అతడి మృతి ఇజ్రాయెల్, అమెరికాకే కాదు.. ప్రపంచ దేశాలకు కూడా ఒక గుడ్ న్యూస్ అని బైడెన్ అన్నారు. ఎలాగూ సిన్వార్ చనిపోయాడు కనుక ఒకవేళ హమాస్ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రావాలనుకుంటే ఇదే సరైన అవకాశం అని అమెరికా అభిప్రాయపడింది. ఇంతకాలం కాల్పుల విరమణ ఒప్పందానికి సిన్వార్ పెద్ద అడ్డుగా నిలిచాడని అమెరికా చెప్పుకొచ్చింది. అంటే.. రాబోయే రోజుల్లో మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రావాల్సిందిగా అమెరికా ఖలీల్‌ని ఆహ్వానించే అవకాశం లేకపోలేదని బైెడెన్ మాటలు చెప్పకనే చెబుతున్నాయి.

గాజాలో ఆకలి చావులు

ఇప్పటివరకు ఇజ్రాయెల్ దాడుల్లోనే చనిపోయిన గాజా వాసులు ఇప్పుడు ఎదుర్కుంటున్న మరో అతి పెద్ద శత్రువు ఆకలి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధంతో పాలస్తీనాలో ఒక భాగమైన గాజాలో ఆహారానికి కొరత ఏర్పడింది. యుద్ధం కారణంగా అక్కడ పంటలు పండించే పరిస్థితి లేదు.. బయటి నుండి లోపలికి దిగుమతి లేదు. దీంతో గాజా ప్రస్తుతం ఆకలి చావుల దిశగా పయణిస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఖలీల్ రూటెటు?

సిద్ధాంతాలు, లక్ష్యం పరంగా ఒకవైపు ఇజ్రాయెల్‌తో యుద్ధం విషయంలో గాజా వెనక్కి తగ్గలేని పరిస్థితి. మరోవైపు సొంతగడ్డపైనే అనేక ప్రతికూల పరిస్థితులు నెలకున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో హమాస్ చీఫ్‌గా ఖలీల్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఖలీల్ హయ తరువాతి నిర్ణయం ఏ విధంగా ఉండనుందనేదే ప్రస్తుతం యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.

Tags:    

Similar News