రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు.. ఒంటరిని చేసే దిశగా.. ఉక్కిరి బిక్కిరవుతున్న రష్యా
Russia - Strict Conditions: ఆంక్షల ప్రభావంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం
Russia - Strict Conditions: ఉక్రెయిన్ సైనిక చర్యపై పాశ్చాత్య దేశాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నా.. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. రోజు రోజుకు యుద్ధాన్ని మరింత తీవ్రం చేస్తున్నారు. అణ్వాయుధాలను సిద్ధం చేయాలని కూడా సైన్యాన్ని పుతిన్ ఆదేశించారు. దీంతో పాశ్యాత్య దేశాలు మరిన్ని కఠిన ఆంక్షలను విధించేందుకు.. ప్రపంచంలో రష్యాను ఏకాకిని చేసేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా రష్యాకు చెందిన అన్ని విమానాలను తమ గగన తలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. తమ ఆంక్షల ప్రభావం రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా ఉంటుందని బైడెన్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై దాడికి ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలను విధిస్తున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత దేశాల జాబితా నుంచి రష్యాను తొలగించాలని బ్రిటన్ అనూహ్య ప్రతిపాదన చేసింది. ఐదు శాశ్వత సభ్య దేశాల నుంచి రష్యాను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. రష్యాకు వ్యతిరేకంగా చేపట్టే చర్యలు ఇదొక భాగమని చెప్పారు. ఇప్పటికే స్విఫ్ట్ నుంచి రష్యన్ బ్యాంకులను తొలగించాయి. రష్యాపై పలు దేశాలు కఠిన ఆంక్షలను విధించాయి.
అయితే గతంలో ఎన్నడూ లేనంతగా విధించిన ఆంక్షలతో రష్యా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా, నాటో కూటమి చక్రబంధంలో చిక్కుకున్నట్టు వివరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచే కాకుండా.. అంతర్జాతీయ సమాజం నుంచి రష్యాను ఒంటరి చేసేందుకే ఈ పాశ్చాత్య దేశాలు ఈ చర్యలకు దిగినట్టు చెబుతున్నారు. గతంలో పలు దేశాల్లో యుద్ధాలు జరిగినప్పుడు కూడా వాటిపై ఆర్థిక ఆంక్షలను విధించాయి. కానీ.. ఇప్పుడు రష్యాపై విధించిన ఆంక్షలు కనీ వినీ ఎరుగనివని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు.
ఆర్థిక రంగంలోనే కాదు.. అన్నింటిలోనూ రష్యాను ఒంటరిని చేస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నీల నుంచి రష్యాను బహిష్కరించాలని అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఆదేశించింది. ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ చాంపియన్స్ లీగ్ ఫైనల్‌ను మాస్కో నుంచి పారిస్‌కు ఫుట్‌బాల్ సంఘాలు తరలించాయి. అమెరికా, బ్రిటన్‌తో పాటు కొన్ని దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేసినా.. జర్మనీ, ఫ్రాన్స్ మెతకవైఖరి అనుసరిస్తాయని భావించిన పుతిన్ అంచనాలు తప్పాయి. ఆ రెండు దేశాలు కూడా కఠిన ఆంక్షలను విధించాయి.