భారతీయుడికే కన్‌జర్వేటివ్ ఎంపీలు జై.. రిషి సునాక్ మంచి ప్రధాని కాగలరంటూ..
UK Opinion Poll: బ్రిటన్ ప్రధాని ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది.
UK Opinion Poll: బ్రిటన్ ప్రధాని ఎన్నిక హోరాహోరీగా సాగుతోంది. రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్‌కే అధికార పార్టీ ఎంపీలు జై కొడుతున్నారు. తాజాగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషికే మొగ్గు చూపుతున్నట్టు ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. ప్రధానిగా రిషి ఎన్నైతే మంచి పీఎంగా ఉండగలరనే విశ్వాసాన్నివ్యక్తం చేస్తున్నట్టు ఒపినియన్ పోల్స్ వెల్లడిస్తున్నాయి. అయితే రిషికి వ్యతిరేకంగా తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. విదేశాంగ మంత్రిగా ఉన్న లిజ్ ట్రజ్‌ను ప్రధానిగా ఎన్నుకోవాలని బోరిస్ ప్రచారం చేస్తున్నట్టు జోరుగా చర్చ జరుగుతోంది.
బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునకే మొదటి నుంచి హాట్ ఫేవరేట్. సర్వేలన్నీ రిషి సనక్‌కే అనుకూలంగా ఉన్నాయి. పార్టీ గేట్ కుంభకోణం విచారణ సమయంలోనూ పలు సర్వేలు, ఆన్‌లైన బెట్టింగ్ కంపెనీల నివేదికల్లోనూ రిషి పేరే మొదటి స్థానంలో నిలిచింది. తాజాగా జేఎల్ పార్టనర్స్ అనే సంస్థ నిర్వహించిన ఒపినియన్ పోల్స్‌లోనూ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మెజార్టీ ఓటర్లు రిషి సునక్ వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రకటించింది. రిషి ప్రధానిగా ఎన్నికైతే మంచి ప్రధానిగా పని చేయగలరని కన్జర్వేటివ్ పార్టీ నేతలు బలంగా నమ్ముతున్నట్టు తెలిపింది. రిషి సునక్ అనుకూలంగా 4వేల 400 మంది కన్జర్వేటివ్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించినట్టు సర్వే సంస్థ తెలిపింది. 48 శాతం ఓట్లతో రిషి సునక్ అగ్రస్థానంలో ఉన్నారు. 39 శాతం ఓట్లతో రెండో స్థానంలో విదేశాంగ శాఖ మంత్రి లిజ్‌ట్రజ్ నిలవగా, 33 శాతం ఓట్లతో మూడో స్థానంలో వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మార్డాంట్ నిలిచారు. ప్రధాని రేసులో ఉన్న అభ్యర్థుల్లో రిషి సునక్ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా కొనసాగుతున్నారు.
వివిధ విభాగాల్లో జేఎల్ పార్టనర్స్ అడిగిన ప్రశ్నలకు కర్జర్వేటివ్‌లు రిషి సునక్‌కే మద్దతు ప్రకటించారు. మంచి ప్రధానిగా ఉండగలిగిన వ్యక్తిగా రిషి సునక్‌కు మూడు వంతుల మంది కన్జర్వేటివ్ పార్టీ నాయకులు మద్దతు పలకగా ఒకవంతు మాత్రం విముఖత వ్యక్తం చేశారు. కొందరు మాత్రమే మార్డాంట్ మంచి ప్రధాని ఉండగలిగిన వ్యక్తని తెలిపారు. టోరీ నేత ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు రౌండ్ల ఓటింగ్ పూర్తయ్యింది. రెండు రౌండ్లలోనూ రిషి సునక్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌లో రిషి సునక్‌కు అనుకూలంగా 101 ఓట్లు రాగా, పెన్నీ మోర్డాంట్ 83 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇక ముందు జరగనున్న ఓటింగ్‌లో రిషి టఫ్ పోటీని ఎన్నుకోనున్నారు. అయితే అధిక శాతం అధికార పార్టీ ఎంపీలు రిషివైపే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం పోటీలో రిషి సునక్‌తో పాటు విదేశాంగ శాఖ మంత్రి లిజ్ ట్రజ్, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ మోర్డాంట్, బెడనోచ్, తుగేంధాట్ పోటీలో ఉన్నారు.
వివిధ కుంభకోణాల్లో ఇరుకున్న బ్రిటన్ తాత్కాలిక ప్రధాని బోరిస్ జాన్సన్‌పై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మొదట మంత్రి పదవికి రాజీనామా చేసి రిషి సునక్ ఒత్తిడి పెంచారు. ఆ తరువాత మంత్రులంతా వరసబెట్టి రాజీనామా చేశారు. దీంతో పార్టీలో బోరిస్‌పై భారీగా ఒత్తిడి పెరగడం గత్యంతరంలేక ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్ చరిత్రలోనే ఇలా ఏ ప్రధాని ఇలా కుంభకోణాల ఆరోపణలతో రాజీనామా చేయలేదు. పైగా అవమానకర రీతిలో నిష్ర్కమించాల్సి వచ్చిందన్న బాధ బోరిస్ జాన్సన్‌లో అధికమైంది. తన రాజీనామాకు రిషి సునకేనని బోరిస్ రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ అత్యున్నత పదవికి రిషి సునక్‌కు దక్కకుండా చేయాలని జాన్సన్ పావులు కదుపుతున్నారు. రిషికి తప్ప ఎవరికైనా ఓటేయాలని పార్టీలో ప్రచారం చేస్తున్నారు. వివాదాలు వచ్చినప్పుడు తనకు అండగా నిలిచిన విదేశాంగ మంత్రి లిజ్ ట్రజ్‌కు ఓటేయాలని సూచిస్తున్నారట.
కర్జర్వేటివ్ నేతలు సహజంగా శ్వేతజాతీయులనే ఇష్టపడుతారు. రిషి సునక్ విషయంలో ఇప్పుడు టోరీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్వేతజాతీయేతరుడైన రిషిని ప్రధానిగా ఎన్నుకుంటే అది బ్రిటన్ చరిత్రలో ఓ మైలురాయిగా మిగులుతుంది. రిషి అభ్యర్థిత్వంపై ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ సారి బ్రిటన్ ప్రధాని అభ్యర్థి ఎంపిక తీవ్ర ఉత్కంఠగా మారింది. కేవలం ప్రధాని ఎన్నుకోవడమే కాదు ఆ దేశంలో ప్రజాస్వామ్యానికే పరీక్షగా మారింది. రిషిని ఎన్నుకోవడంతో యూకేలో టోరీ నేతల పరిక్వత కూడా ప్రపంచానికి తెలియనున్నది. ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పే బ్రిటన్‌లో భారతీయులను సమానంగా చూస్తున్నారా? లేదా? అనేది ప్రపంచానికి తెలియనున్నది. ఒకవేళ ఓడిపోయినా అక్కడికి దాకా ఓ భారతీయుడు వెళ్లడం నిజంగానే గర్వకారణం.
ప్రధాని రేసులో రిషి ముందువరుసలో ఉన్నారు. ఓటింగ్‌లో రిషి గెలిస్తే మాత్రం బ్రిటన్ ప్రధాని పీఠాన్ని అధిష్ఠించే తొలి హిందువు, భారత సంతతికి చెందిన వ్యక్తి ఆయనే అవుతారు. సెప్టెబరు 5న తుది ఫలితాలను వెల్లడించి ప్రధాని పేరును ప్రకటించనున్నారు. అప్పటివరకు బోరిస్ జాన్సన్ ప్రధానిగా కొనసాగనున్నారు.