తారాస్థాయికి చేరుకున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. జనవరిలో మొదలైన ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నవంబర్‌ నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.

Update: 2020-10-29 15:20 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు తారాస్థాయికి చేరింది. జనవరిలో మొదలైన ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. నవంబర్‌ నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు. రిపబ్లికన్‌ నుంచి డోనాల్డ్‌‌ట్రంప్ నకు‌ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కరోనా ప్రభావం, నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభాల మధ్య నడుస్తున్న ‌ట్రంప్ నకు ఈ సారి ఎన్నికలు నల్లేరు మీద నడక కాకపోవచ్చు. ప్రతిపక్ష డెమోక్రటిక్‌ అభ్యర్ధి బైడెన్‌ నుంచి డోనాల్డ్‌ట్రంప్ నకు గట్టి పోటీ ఎదురవుతోంది.

అమెరికా అధ‌్యక్ష ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరింది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రాల ప్రతినిధుల ఎన్నికతో మొదలైన అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. పార్టీ సర్వసభ్య సమావేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రాథమిక ఎన్నికల ప్రక్రియ ద్వారా సభ్యుల ఎన్నిక పూర్తైంది. అమెరికా అధ్యక్ష పదవిలో ఒకే వ్యక్తి రెండుసార్లు కొనసాగే అవకాశం ఉండటంతో రిపబ్లికన్‌ తరపున డోనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ బరిలో దిగుతున్నారు. ట్రంప్‌కు పోటీగా డెమోక్రట్ల అభ‌్యర్ధిగా బైడెన్‌ బరిలో దిగుతున్నారు. 538మంది సభ్యులున్న అమెరికా ఎలక్ట్రోరల్‌ కాలేజీలో 270 ఓట్లు లభించిన వారికి వైట్‌హ‍ౌస్‌లో అధ్యక్షుడిగా అడుగుపెట్టే అదృష్టం లభిస్తుంది.

ఎన్నికలు ఇలా..

పరోక్ష పద్ధతిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సెనేటర్లను ఎన్నుకోవడం ద్వారా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. అమెరికా అధ‌్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులే ఎన్నుకుంటారు. నాలుగేళ్లకోమారు జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తొలిదశ సహజంగా నవంబర్‌ 2 - 8 తేదీల మధ్యే జరుగుతాయి. 2020 నాటి ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. ఫెడరల్‌ చట్టాలతో పాటు అయా రాష్ట్ర చట్టాల ప్రకారం జరిగే ప్రాథమిక ఎన్నికల్లో సెనేటర్లు, ప్రతినిధుల ఎంపిక జరుగుతుంది. రాష్ట్రాల సెనేటర్లు, ప్రతినిధుల సంఖ్యను బట్టి ఎలక్ట్రోరల్‌ కాలేజీ ప్రతినిధుల సంఖ్యను నిర్ణయిస్తారు. ప్రాథమిక ఎన్నికలు, సమావేశాల గురించి అమెరికా రాజ్యాంగంలో ఎలాంటి వివరణ లేకపోవడడంతో ఒక్కో చోట ఒక్కో విధానాన్ని అనుసరిస్తారు.

సాధారణంగా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత జనవరి - జూన్‌ నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. రాష్ట్రాల్లో పార్టీల బలాబలాల ఆధారంగా ప్రధాన పార్టీల అభ్యర్ధుల ఎంపిక ఖరారవుతుంది. అమెరికా ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ప్రాథమిక ఎన్నికల్లో ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యులను ఎన్నుకోవడం ద్వారా ఎన్నికల్లో ప్రభావం చూపిస్తారు. ఇక అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యుల ఎన్నికల్ని నవంబర్‌ నెలలో మొదటి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం నిర్వహించాలని రాజ్యాంగం సూచించింది. దీని ప్రకారం ఈ ఏడాది నవంబర్‌ 3న విస్త్రత స్థాయి ఎన్నికల్లో ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. జాతి, కుల, లింగ వివక్షలతో సంబంధం లేకుండా 18ఏళ్లు దాటిన వారెవరైనా అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రతినిధిని ఎన్నిక చేయొచ్చు. దీంతో నవంబర్‌ 3న జరిగే ఎలక్ట్రోరల్‌ కాలేజీ సభ్యుల ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

ఏరులై పారుతున్న సొమ్ములు..

ఇక పారదర్శకత, ప్రజాస్వామ్యం విషయంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తామని గొప్పలు చెప్పుకునే అమెరికా ఎన్నికల్లో డబ్బు వరదలై పారుతోంది. ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరడంతో రిపబ్లికన్‌, డెమోక్రాటిక్‌ పార్టీలు పోటీ పడి ఖర్చుచేస్తున్నాయి. సదస్సులు, కన్వెషన్లు, టీవీ చర్చల కోసం కోట్ల డాలర్లు గుమ్మరిస్తున్నాయి. వీటికి అమెరికా బహుళజాతి సంస్థలు డబ్బు సమకూరుస్తున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు మునుపెన్నడు లేని విధంగా అంచనాలు దాటిపోతోంది. అధికారాన్ని దక్కించుకునేందుకు అధికార, విపక్షాలు డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నాయి. మునుపెన్నడు లేని విధంగా ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కార్పొరేట్‌ ధనం కీలక పాత్ర పోషిస్తోంది. కార్పొరేట్‌ అమెరికా నుంచి విరాళాలను దండుకోవడానికి రిపబ్లికన్లు., డెమొక్రాట్లు పోటీపడుతున్నారు. ఓట్ల కొనుగోలుకు ఏర్పాటు చేసిన జాతీయ సదస్సులంటూ న్యూయార్క్‌టైమ్స్‌ సహా అన్ని పత్రికలు పార్టీల సదస్సులను ఉద్దేశించి విమర్శలు గుప్పిస్తున్నాయి.

గ్రీన్‌హౌస్‌ వాయువులు, ఇతర ప్రమాదకర వ్యర్ధాల నియంత్రణ, రవాణా నిబంధనల వంటి అంశాలపై లాబీయింగ్‌ కోసం రైల్వే సంస్థ సిఎస్‌ఎక్స్‌ ఎన్నికల ప్రచారానికి దాదాపు 50 లక్షల డాలర్లు వెచ్చించింది. కొన్ని రాష్ట్రాల్లో నిర్వహించిన రిపబ్లికన్‌ సదస్సుకు ఇదే సంస్థ ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో మద్దతు కోసం నిర్వహిస్తోన్న సదస్సులకు హాజరయ్యే ప్రతినిధులు, నేతలకు అవసరమైన ఏర్పాట్లను అమెరికన్స్‌ ఫర్‌ ప్రోస్పెరిటీ వంటి ధనిక స్వచ్ఛంద సంస్థలు, అమెరికన్‌ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్‌ వంటి వాణిజ్య సంస్థలు లాబీయింగ్‌ సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలతో పాటు అమెరికా కుబేరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 10కోట్ల డాలర్లతో బడ్జెట్‌ను రూపొందించిన రిపబ్లికన్‌ ఆతిథ్య కమిటీ, ఈ మొత్తాన్ని చెవ్రాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి వ్యాపార దిగ్గజాల నుంచి వసూలు చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరిగే సదస్సుల్లో రాజకీయాలు చోటు చేసుకోవటం సర్వసాధారణమే అయినా నిధుల సేకరణ, లాబీయింగ్‌, డైనింగ్‌, వినోద కార్యక్రమాల వంటివి ఈ సదస్సుల్లో భారీ ఎత్తున చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలోనే నిధుల సేకరణ కోసం రిపబ్లికన్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థులు పదుల సంఖ్యలో సమా వేశాలు నిర్వహించారు. కనెక్టికట్‌, వాషింగ్టన్‌, కొలొరాడొలలో ప్రచారంతో పాటు నిధుల వసూళ్ల కార్యక్రమం కూడా నిర్వహించారు. అటు- రిపబ్లికన్‌ పార్టీ నిర్వహించిన సదస్సుకు అమెరికన్‌ పెట్రోలియం ఇన్‌స్టిట్యూట్‌, చెవ్రాన్‌, కోకాకోలా, సిఎస్‌ఎక్స్‌, ఫోర్డ్‌, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, యుపిఎస్‌, వాల్‌మార్ట్‌, వెల్స్‌‌ఫార్గో వంటి కార్పొరేట్‌ దిగ్గజాలు స్పాన్సర్‌ చేయగా, డెమోక్రాట్ల జాతీయ సదస్సుకు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, డ్యూక్‌ ఎనర్జీ, ఎటి అండ్‌ టి, కోకాకోలా, వెల్స్‌ ఫార్గో వంటి సంస్థలు ఆర్థిక అండదండలు సమకూర్చాయి. అధికారాన్ని దక్కించుకునేందుకు ట్రంప్‌, బైడెన్‌ వ్యవహరిస్తున్న తీరుపై అగ్రరాజ్యంలోనే నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఏమైనా అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోసం చేసే ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. జనవరి నుండి జూన్‌ వరకు బైడెన్‌ 150 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తే., డోనాల్డ్‌ ట్రంప్‌ 500 మిలియన్‌ డాలర్లు వెచ్చించారు. పగలంతా పేద, మధ్యతరగతి ప్రజలకు సహాయ పడతానని ఎన్నికల ప్రచారాలలో ప్రమాణాలు చేసే ట్రంప్‌.... రాత్రులంతా ఖరీదైన హోటళ్లలో వాల్‌ స్ట్రీట్‌ ఆర్థికవేత్తలతోనూ, హాలివుడ్‌ సెలెబ్రిటీలతోనూ, ఇతర ధనిక వర్గాలతో గడుపుతారని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

Tags:    

Similar News