Allan Lichtman: ఎవరీ అమెరికా వీరబ్రహ్మం గారు... కమలా హారిసే గెలుస్తారని ఎలా చెబుతున్నారు?
Allan Lichtman: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ విజయం సాధిస్తారని చెప్పారు అలన్ లిట్మన్.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ విజయం సాధిస్తారని చెప్పారు అలన్ లిట్మన్. 1984 నుంచి ఒక్కసారి తప్పిస్తే ప్రతి ఎన్నికల్లో ఆయన చెప్పినట్టుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఏదైనా అద్భుతాలు జరిగితేనే ట్రంప్ విజయం సాధిస్తారని ఆయన చెప్పారు.
ఎవరీ లిట్మన్?
న్యూయార్క్ బ్రూక్లిన్ లో 1947 ఏప్రిల్ 4న లిట్మన్ పుట్టారు. స్టూవేసంట్ ఉన్నత పాఠశాలలో ఉన్నత విద్యను పూర్తి చేశారు. 1967లో బ్రాండెస్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1973లో హార్వర్డ్ యూనివర్శిటీలో ఆయన పీహెచ్ డీ కంప్లీంట్ చేశారు. అదే ఏడాది వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా చేరారు. ఇదే యూనివర్శిటీలో చరిత్ర విభాగానికి 1993లో హెచ్ఓడీగా నియమితులయ్యారు. సీఎన్ఎన్, ఎంఎస్ఎన్ బీసీ, ఫాక్స్ వంటి చానెల్స్ కు ఆయన కామెంటెటర్ గా పనిచేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన అంచనాలు నిజమౌతున్నందున నోస్ట్రడేమస్ గా లిట్మన్ పేరొందారు.
ఎవరు గెలుస్తారో చెప్పేందుకు13 పాయింట్ల ఫార్మూలా
అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో అంచనా వేసేందుకు లిట్మన్ 13 పాయింట్ల ఫార్మూలాను తయారు చేశారు. గణిత శాస్త్రవేత్త వ్లాదిమిర్ కీలిస్-బోరోక్ తో కలిసి 1981లో ఈ ఫార్మూలాను రూపొందించారు. దీన్ని కీస్ టు ది వైట్ హౌస్ గా పిలుస్తారు. ఆరు కంటే ఎక్కువ పాయింట్లు బరిలో ఉన్న అభ్యర్ధికి వ్యతిరేకంగా ఉంటే ఆ అభ్యర్ధి ఓడిపోతారని ఆయన చెబుతున్నారు.
ప్రస్తుతం డెమోక్రటిక్ అభ్యర్ధి కమలా హారిస్ కు ఎనిమిది పాయింట్లు అనుకూలంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్ణయం ,పోటీదారులు, థర్డ్ పార్టీ, షార్ట్ టర్మ్ ఎకానమీ, లాంగ్ టర్మ్ ఎకానమీ,పాలసీ మార్పు, సోషల్ అన్ రెస్ట్, కుంభకోణాలు, విదేశీ, మిలటరీ ఫెయిల్యూర్, విదేశీ, మిలటరీ సక్సెస్ వంటి అంశాల ఆధారంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం ఎవరివైపు ఉంటుందో ఆయన అంచనా వేస్తారు. 2024 ఫలితాలకు సంబంధించి తాను చెబుతున్న అంచనాలు తుది అంచనాలు కావన్నారు.
లిట్మన్ అంచనాలు తప్పింది అప్పుడే
లిట్మన్ అంచనాలకు తగ్గట్టుగా 1984 నుంచి ఇప్పటివరకు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కానీ, 2000 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన అంచనాలు తప్పాయి. రిపబ్లికన్ అభ్యర్ధి జార్జ్ డబ్ల్యు బుష్ పై డెమోక్రటిక్ అభ్యర్ధి గోర్ విజయం సాధిస్తారని ఆయన అంచనా వేశారు. అయితే ఆ ఎన్నికల్లో బుష్ విజయం సాధించారు. కానీ, ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఆయన చెప్పినట్టుగానే ఫలితాలున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ పేరును డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే పార్టీలోని కీలక నాయకులు ఆమె అభ్యర్ధిత్వానికి మద్దతు ప్రకటించారు.