అమెరికాలో రోజు రోజుకూ రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌ను గద్దె దించేందుకు డెమొక్రాట్లు సిద్ధమయ్యారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. అమెరికా క్యాపిటల్ భవనాన్ని ముట్టడించడానికి ట్రంప్ తన మద్దతుదారులను ప్రోత్సహించారంటూ దిగువసభలో అభిశంసన తీర్మానం రాశారు డెమొక్రటిక్ పార్టీ సభా నాయకుడు డేవిడ్ సిసిలీన్.
అయితే ఈ అభిశంసనకు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ సభ్యులే మద్దతు తెలుపుతున్నారు. ఇక 25వ రాజ్యాంగ సవరణ కింద ట్రంప్‌ను తొలగించే అంశాన్ని ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక అభిశంసన తీర్మానానికి 185 మంది మద్దతు తెలిపారు. బుధవారం దీనిపై ఓటింగ్ జరగనుంది. అనంతరం సెనేట్‌కు పంపిస్తారు. ఆయనను పదవి నుంచి తొలగించాలా, వద్దా అనే దానిపై అక్కడ నిర్ణయిస్తారు.
అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ఆమోదం తెలపడానికి సంయుక్త సమావేశం నిర్వహించగా ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనాన్ని ముట్టడించారు. ఆ సమయంలో పెన్స్ భద్రత గురించి ట్రంప్ పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ సమావేశంలో తనకు అనుకూలంగా వ్యవహరించలేదంటూ పెన్స్‌పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు.