United Nations: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం
United Nations: ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై భద్రతా మండలిలో ఓటింగ్
United Nations: ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. మండలిలో 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌పై దండయాత్రను ఖండిస్తూ ఓటు వేశాయి. అయితే భద్రతా మండలిలో ఐదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా తన విటో అధికారాన్ని ఉపయోగించి.. ముసాయిదాను తిరస్కరించింది. ఇక మొదటి నుంచి ఉక్రెయిన్- రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి.
రష్యాను ఏకాకిగా చేయాలని భావించిన అమెరికా మరో దేశం అల్బేనియాతో కలిసి ఈ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించింది. మరోవైపు 193 సభ్యదేశాలు ఉన్న ఐరాస జనరల్ అసెంబ్లీలో ఈ ముసాయిదాను ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భద్రతా మండలిలో రష్యా విటోను ఉపయోగించి తీర్మానాన్ని అడ్డుకున్నప్పటికీ, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేశామని పశ్చిమదేశాలు భావిస్తున్నాయి.
మీరు ఈ తీర్మానాన్ని విటో చేసి ఉండవచ్చు కానీ.. తమ గొంతులను మీరు విటో చేయలేరని ఓటింగ్ అనంతరం ఐరాసలో యూఎస్ రాయబారి చెప్పుకొచ్చారు. నిజాన్ని, తమ విలువలను మీరు విటో చేయలేరన్నారు. ఉక్రెయిన్ ప్రజలను విటో చేయలేరని రష్యాను ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు యూఎస్ రాయబారి.