United Nations: ప్రమాదపు అంచున పర్యావరణం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
* మానవాళికి డేంజర్ బెల్స్ * భయపెడుతున్న శీతోష్ణస్థితిలోని మార్పులు * ఉష్ణోగ్రతలు తగ్గించకుంటే భారీ మూల్యం
United Nations: ప్రపంచ పర్యావరణం ప్రమాదపు అంచున కొట్టుమిట్టాడుతోందని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. పర్యావరణ భద్రతపై దృష్టిసారించకుంటే ప్రజలు పారిపోయేందుకు స్థలముండదని యూఎన్‌వో నివేదిక స్పష్టం చేస్తోంది. పర్యావరణ పరిస్థితి చేయిదాటిపోతోందని 'కోడ్ రెడ్ ఫర్ హ్యుమానిటీ' నివేదిక రూపకర్త లిండా మెర్న్స్ వెల్లడించారు. శీతోష్ణస్థితి మార్పు నుంచి తప్పుకునే ఛాన్స్ లేకుండా మనమే చేసుకున్నామని లిండా మెర్న్స్ అన్నారు.
21వ శతాబ్దంలో ఇంతవరకు ఐపీసీసీ ఇలాంటి సీరియస్ అంచనాలను వెలువరించలేదు. రాబోయే ప్రమాదం తప్పిపోవాలంటే పారిస్ ఒప్పందంలో పేర్కొన్న దానికన్నా రెండింతలు అధికంగా, వేగంగా కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిఉంటుందన్నారు. 2015 ప్యారిస్ ఒప్పందం ప్రకారం భూఉపరితల ఉష్ణోగత్ర 19వ శతాబ్దపు స్థాయిలకన్నా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి పెరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రపంచ నేతలు అంగీకరించారు. ఇప్పటికే ప్రపంచ ఉష్ణోగత్రలు 19వ శతాబ్దపు గరిష్టస్థాయిల కన్నా 1.1 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉన్నాయి. అంటే ప్రపంచం ముప్పునకు చాలా దగ్గరగా ఉందని తెలుస్తోంది.
నవంబర్‌లో జరిగే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో ఈ నివేదిక చర్చకు రానుంది. ఉద్గారాల తగ్గింపు విషయంలో తక్షణ చర్యల అవసరాన్ని నివేదిక నొక్కి చెప్పిందని పలువురు ప్రపంచ నేతలు అభిప్రాయపడ్డారు. ఇది ఒక గట్టి హెచ్చరికగా అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ అభివర్ణించారు. మానవాళికి ఇది కోడ్ రెడ్ నివేదికని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఆందోళన వ్యక్తం చేశారు.
భూ ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి వాయువులు ప్రచండంగా వీస్తాయని నివేదిక వెల్లడించింది. తీవ్రమైన కరువు, అనూహ్య వరదలు సంభవిస్తాయని నివేదిక తేల్చి చెప్పంది. అయితే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఊహించనంత వేగంగా దేశాలు కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలి. తీవ్రమైన కాలుష్య నివారణ చర్యలను పాటించాలి. ఉద్గారాల నియంత్రణ చేపట్టాలి. ప్రస్తుతమున్న స్వల్పకాలిక ప్రణాళికలను కొనసాగించాలి. అప్పుడే ఈ ఉత్పాదం నుంచి తప్పించుకోవచ్చని ఐపీసీసీ సూచిస్తోంది.