ఆసక్తికరంగా బ్రిటన్ రాజకీయాలు.. 24లోగా ప్రధాని పదవి నుంచి లిజ్ ట్రస్ ఎగ్జిట్?
*అవిశ్వాస తీర్మానానికి 100 ఎంపీలు సిద్ధం!
Liz Truss: బ్రిటన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రస్తుత ప్రధానమంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు సొంత పార్టీ ఎంపీలు పావులు కదుపుతున్నారు. ఈనెల 24లోగా లిజ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు 100 మంది కన్జర్వేటివ్ ఎంపీలు సిద్ధమైనట్టు బ్రిటన్ మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి టోరీ పార్టీ ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వారిని గద్దె దించాలంటే ఏడాది పాటు వేచి ఉండాల్సిందే. అయితే పార్టీ నిబంధనలను మార్చే అధికారం కన్జర్వేటివ్ ఎన్నికల కమిటీకి ఉటుంది. ఈ కమిటీకి హెడ్‌గా ప్రస్తుతం గ్రాహమ్ బాడీ పని చేస్తున్నారు. తాజాగా 100 మంది పార్లమెంట్ సభ్యులు తమ అవిశ్వాస పత్రాలను బ్రాడీకి సమర్పించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ట్రస్ సమయం ముగిసిందని అవిశ్వాస తీర్మానంపై తక్షణమే ఓటింగ్ నిర్వహించేందుకు వీలుగా పార్టీ నిబంధనలను మార్చాలని కోరనున్నట్టు కథనాలు వస్తున్నాయి.
ప్రధాని లిజ్ ట్రస్‌పై అవిశ్వాస తీర్మానానికి పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్ గ్రాహమ్ బ్రాడీ మాత్రం పెద్దగా స్పందించడం లేదట. రెండు నెలలు కూడా పూర్తికాకముందే పదవి నుంచి దించడమేమిటని ప్రశ్నిస్తున్నారాట. ప్రధానిగా లిజ్ ట్రస్‌కు మరో అవకాశం ఇవ్వాలంటూ పార్లమెంట్ సభ్యులను బ్రాడీ కోరినట్టు తెలుస్తోంది. అక్టోబరు 31న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో మరో ఆర్థిక వ్యూహాన్ని ప్రకటించేలా ట్రస్‌కు అవకాశం ఇవ్వాలని సూచించారట. ట్రస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ భారీగా పతనమైంది. మినీ బడ్జెట్‌లో సంపన్నులకు పన్ను రాయితీలను కల్పించారు. దీంతో బ్రిటన్‌లో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పదవిని కాపాడుకునేందుకు లిజ్ ట్రస్ ఆర్థిక శాఖ మంత్రి.. క్వాసీని తప్పించారు. ఆయన స్థానంలో జెరమీ హంట్‌ను నియమించారు. దీనిపై కన్జర్వేటివ్ ఎంపీలు మాత్రం ప్రధానిపై గుర్రుగా ఉన్నారు. ఆమెను పదవి నుంచి ఉద్వాసన పలకాల్సిందేనని పట్టుబడుతున్నారు. పార్టీలో 62 శాతం మంది నేతలు.. తాము తప్పుడు అభ్యర్థిని ప్రధానిగా ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్టు తాజాగా ది టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో తేలింది.
లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలను.. ప్రధాని ఎన్నిక ప్రచారంలోనే మాజీ మంత్రి.. ప్రధానిగా పోటీ చేసిన భారతీయ సంతతికి చెందిన రిషి సునక్ వ్యతిరేకించారు. ట్రస్సోనామిక్స్‌తో దేశానికి ఆర్థిక సంక్షోభం తప్పదని అప్పట్లో హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పన్ను రాయితీలే సరికాదని రిషి వాదించారు. కానీ.. రిషిని టోరీ సభ్యులు వ్యతిరేకించారు. పన్ను రాయితీలను కల్పిస్తామన్న ట్రస్‌కే పెద్ద పీట వేశారు. ప్రధానిగా ఆమెకు పట్టం కట్టారు. అప్పుడు రిషిని వ్యతిరేకించిన వారే.. ఇప్పుడు రిషి అయితే బాగుండేదని అంటున్నారు. తాము తప్పుడు వ్యక్తిని ఎన్నుకున్నామని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. నిజానికి కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో అత్యధికులకు లిజ్ ట్రస్‌పై పెద్దగా ఆసక్తి లేదు. ప్రధాని అభ్యర్థి ఎంపిక ఓటింగ్‌లో లిజ్ ట్రస్‌కు పెద్దగా ఎంపీలు ప్రాధాన్యం ఇవ్వలేదు. అందులో అత్యధిక ఓట్లతో రిషి సునకే ముందంజలో ఉండగా.. ట్రస్ రెండో స్థానానికే పరిమితమయ్యారు. అయితే కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల ఓటింగ్‌లో మాత్రం అనూహ్యంగా ట్రస్‌కు అధిక ఓట్లు వచ్చాయి. దీని వెనుక బోరిస్ జాన్సన్ పావులు కదిపారన్న ప్రచారం కూడా అప్పట్లో పెద్ద ఎత్తున సాగింది.
తాజాగా మళ్లీ రిషి సునక్ పేరు తెరపైకి వస్తోంది. లిజ్ ట్రస్‌ను తొలగించి.. ప్రధానిగా రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కన్జర్వేటివ్ నేతలు ఆ ప్రయత్నం చేసి.. సఫలమైతే మాత్రం.. బ్రిటన్‌లో మరో రికార్డు నెలకొననున్నది. 2016లో ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన తరువాత.. ప్రధానమంత్రి అర్ధంతరంగా పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి కానున్నది. ఇక రిషి సునక్‌పై టోరీ ఎంపీల్లో మంచి అభిప్రాయమే ఉంది. అత్యంత క్లిష్టమైన కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఆర్థిక వ్యవస్థను ఎంతో చాకచక్యంగా నడిపించారు రిషి సునక్. అంతేకాకుండా.. పలు కంపెనీల్లో పని చేసిన అనుభవం కూడా ఆయన సొంతం. అయితే బోరిస్ జాన్సన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ.. మొదటి అడుగు వేసింది రిషి సునకే. అందుకే పలువురు బోరిస్ సన్నిహితులు రిషికి వ్యతిరేకంగా, లిజ్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. ఇది టోరీ నేతల్లో తీవ్ర ప్రభావం చూపింది.