ట్రంప్‌కు షాక్.. డొనాల్డ్ ఖాతాపై ట్విటర్ శాశ్వత నిషేధం
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విటర్ షాక్ ఇచ్చింది.
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ట్విటర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్స్ క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయనే నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్విటర్ వివరణ ఇచ్చింది. దీనికితోడు మరోసారి హింసాత్మక అల్లర్లకు మద్దతిచ్చే రిస్కులున్నందున ఆయన ఖాతాను మూసివేసినట్లు తెలియజేసింది.
అంతేకాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జోబైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు ఇటీవల యూఎస్ కాంగ్రెస్ ఇటీవల సమావేశమైంది. దీన్ని అడ్డుకునేందుకు ట్రంప్ మద్దతుదారులు యూఎస్ క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకురావడంతో ఘర్షణ చెలరేగింది. నలుగురు పౌరులతో పాటు గాయపడ్డ ఓ పోలీస్ అధికారి మృతి చెందారు. ఓ వైపు క్యాపిటల్ హిల్ భవనంలో బైడెన్ ఎన్నిక గురించి సమావేశం జరుగుతుండగా.. మరో వైపు ట్రంప్ తన మద్దతుదారుల్ని మరింత రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అభిమానలులను తిరిగి వెళ్లాలని అంటూనే ఎన్నికల్లో మోసం జరిగిందని ఆరోపించారు.
ట్రంప్‌సహా వివిధ ప్రపంచ నేతలకు చాలకాలంగా నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నట్లు ట్విటర్ ఈ సందర్భంగా వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు(దాడులు), హేట్ స్పీచ్ తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనలనుంచి మినహాయింపులను ఇస్తున్నట్లు తెలియజేసింది. ఓవైపు ఫేస్‌బుక్ ఈ నెల 20వరకూ తాత్కాలికంగా ట్రంప్ ఖాతాను నిలిపివేయగా.. మరోవైపు ట్విటర్ సైతం తొలుత 12 గంటలపాటు ట్రంప్ అకౌంట్‌ను లాక్ చేసిన సంగతి తెలిసిందే. తాజా ఒత్తిళ్ల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేదించింది.