Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.6గా నమోదు
Earthquake: భూకంపం ధాటికి దెబ్బతిన్న భవనాలు
Earthquake: మెక్సికోలోని సెంట్రల్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.6గా నమోదైంది. పసిఫిక్ తీరంలోని మైకోకాన్ రాష్ట్రంలోని కోల్‌కోమన్‌కు దక్షిణంగా 59 కిలోమీటర్లు, అక్విలాకు ఆగ్నేయంగా 37 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు మెక్సికన్ భూకంప శాస్త్రవేత్తల తెలిపారు. మెక్సికోలోని మిచోకాన్ తీరం వెంబడి సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ హెచ్చరికలు జారీ చేసింది.
భూకంపంతో కోలోకోమన్ పట్టణంలో భవనాలు పగుళ్లు బారాయి. భారీ ప్రకంపన ధాటికి భవనాలు దెబ్బతినగా.. జనం భయంతో పరుగులు పెట్టారు. అయితే, భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి నష్టం జరుగలేదని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బాయ్ ట్వీట్ చేశారు. రాజధానిలో ప్రకంపనల వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. భూకంపం కారణంగా మైకోకాన్ భూకంప కేంద్రం సమీపంలోని రెండు ఆసుపత్రులు దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.
ఇక 1985, 2017 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు మెక్సికోలో భూకంపాలు నమోదయ్యాయి. మళ్లీ అదే రోజు భారీ ప్రకంపనలు రావడం భయాందోళనకు గురిచేస్తోంది. సెప్టెంబర్ 19, 1985న మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. 2017లో రిక్టర్ స్కేల్‌పై 7.1 తీవ్రతతో భూమి కంపించగా.. 370 మంది ప్రాణాలు కోల్పోయారు.