Afghanistan: తాలిబన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం

Afghanistan: పాలనకు సర్వం సిద్ధం చేసినట్లు ప్రకటించిన తాలిబన్లు

Update: 2021-09-04 03:15 GMT

ఆఫ్ఘన్ లో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధం (ఫైల్ ఇమేజ్)

Afghanistan: ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ల ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇరాన్‌ తరహాలో ఇస్లామిక్‌ పాలనకు సర్వం సిద్ధం చేసినట్లు తాలిబాన్లు ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తాలిబాన్ల కీలక నేతలంతా కాబూల్‌ చేరుకున్నారు. ప్రభుత్వ కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. సుప్రీంలీడర్‌గా హైబతుల్లా అఖుంద్‌జాదా ఉంటారని అనధికారంగా వెల్లడించారు. అధ్యక్షుడిగా తాలిబాన్ల రాజకీయ విభాగం చీఫ్‌ ముల్లా అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ పేరు దాదాపు ఖరారైంది. తాలిబాన్ల రాజకీయ విభాగం తరఫున ఖతార్‌ వేదికగా భారత్‌ సహా.. పలు దేశాలతో చర్చలు జరుపుతున్న షేక్‌ మహమ్మద్‌ అబ్బాస్‌ స్థానెక్జాయ్‌ని విదేశాంగ మంత్రిగా ప్రకటించనున్నట్లు సమాచారం.

కశ్మీర్‌లోని ముస్లింల తరఫున తాము గళమెత్తుతామని మరో అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ప్రకటించారు. ముస్లిం దేశంగా ప్రపంచంలోని ముస్లింల తరఫున తాము మాట్లాడతామన్నారు. అయితే.. ఏ దేశం మీదా దాడికి ప్రయత్నించబోమని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నామని.. జమ్మూ కశ్మీర్‌ విషయంలో జోక్యం చేసుకోబోమని చెప్పిన తాలిబన్లు ఒక్కసారిగా మాట మార్చారు.

ఇదిలా ఉండగా పంజ్‌షీర్‌పై పట్టుకోసం తాలిబన్లు ప్రయత్నిస్తుండగా.. వారికి తలొగ్గేది లేదంటూ రెబల్స్‌ భీష్మించుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. రెబల్స్‌ కొండ ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రదేశాల్లో ఉంటూ దాడులు చేస్తుండడంతో తాలిబాన్ల వైపు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News