Taiwan Vs China: దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు
Taiwan Vs China: పోటాపోటీగా చైనా, తైవాన్ సైనిక విన్యాసాలు
Taiwan Vs China: దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవైపు డ్రాగన్ కంట్రీ మరోవైపు తైవాన్ వరుసగా మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నాయి. తైవాన్ అంతటా సైనిక సైరన్లు వినిపిస్తున్నాయి. దీంతో ద్వీప దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని తైవాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మరోవైపు అమెరికా ప్రజా ప్రతినిధులు త్వరలో తైవాన్ పర్యటనకు రానున్నండంతో బీజింగ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా చట్ట సభ్యులు తైవాన్‌లో పర్యటిస్తే యుద్ధం తప్పదని డ్రాగన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా హూంకరించింది.
దక్షిణ చైనా సముద్రంలో రోజు రోజుకు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. తైవాన్ విషయంలో చైనా దూకుడు పెంచింది. వాయు, సముద్ర మార్గాల్లో సైనిక విన్యాసాలను తీవ్ర చేసింది. తైవాన్ పరిధిలోని సముద్ర జలాల్లోకి బీజింగ్ విమానాలు దూసుకెళ్తూ తైపీపై ఒత్తిడి పెంచుతోంది. చైనాకు దీటుగా తైవాన్ సైతం సైనిక విన్యాసాలను చేపట్టింది. భారీగా సాయుధ వాహనాలను సమీకరించి విన్యాసాలను తైవాన్ ఆర్మీ నిర్వహిస్తోంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ ఆధ్వర్యంలో సంయుక్తం విన్యాసాలు నిర్వహిస్తుండడంతో దేశమంతటా సైరన్లు వినిపిస్తున్నాయి. చైనా తరచూ తైవాన్‌ను రెచ్చగొట్టే విధంగా సైనిక విన్యాసాలు చేస్తోందని తైవాన్ ఆరోపిస్తోంది అందుకే తమ బలగాలు కూడా సైనిక విన్యాలు చేపట్టినట్టు తెలిపారు. అటు చైనా, ఇటు తైపీ దళాల విన్యాలతో తైవాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
ఆగస్టులో అమెరికా కాంగ్రెస్ స్పీకర్ నాన్సీ ఫెలోసీ పర్యటన ఖరారైనట్టు తెలుస్తోంది. అధికారికంగా షెడ్యూలు మాత్రం విడుదల కాలేదు. అయితే దీనిపై బీజింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాన్సి ఫెలోసీ తైవాన్ పర్యాటనను మానుకోవాలని సూచించింది. కాదని తైవాన్‌లో అమెరికా ప్రతినిధులు అడుగుపెడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని డ్రాగన్ కంట్రీ హెచ్చరించింది. అయితే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాత్రం చైనా చెప్పలేదు. ఫెలోసీ తైవాన్ పర్యటన.. చైనాను రెచ్చగొట్టడమేనని ఇది వాషింగ్టన్-బీజింగ్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని డ్రాగన్ స్వరం పెంచింది. వన్ చైనా విధానాన్ని ఉల్లంఘించడం తగదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టిన తరువాత తైవాన్‌కు మద్దతు పలుకుతున్నారు. భారీగా ఆయుధాలను ఇస్తున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన యాంటీ మిస్సైల్ రాకెట్‌ను ధ్వంసం చేసినట్టు చైనా పేర్కొంది. తైవాన్‌కు ఆయుధాలను ఇవ్వడాన్ని, ఆ మార్గంలో అమెరికా నౌకలు వెళ్లడాన్ని చైనా తప్పుపడుతోంది.
తైవాన్ విషయంలో అమెరికా, చైనా మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా స్పీకర్ నాన్సీ ఫెలసీ ఆగస్టులో తైవాన్ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో మళ్లీ ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తైవాన్ పర్యటనకు ఫెలోసీ వెళ్లకపోవడమే మంచిదని పెంటగాన్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నిజానికి గతేడాది ఏప్రిల్‌లోనే ఫెలోసీ తైవాన్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే అప్పుడు కోవిడ్ ఉధృతి కారణంగా ఆగిపోయారు. తైవాన్ పర్యటన ద్వారా ఆ దేశానికి అమెరికా మద్దతు ఉంటుందని చెప్పడమే తమ ఉద్దేశమని ఫెలోసీ తెలిపారు. ఒకవేళ ఫెలోసీ పర్యటనకు ఖరారైతే మాత్రం 1997 తరువాత తొలిసారి అమెరికా చట్టసభ్యులు తైవాన్‌కు వెళ్లడం మాత్రం ఇదే తొలిసారి. అయితే చైనా హెచ్చరికల నేపథ్యంలో.. ఫెలోసీ సైతం స్పందించారు. తన పర్యటనపై అధ్యక్షుడు బైడెన్ ెలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదని తెలిపారు. తమ విమానంపై చైనా దాడి చేస్తుందని.. పెంటగాన్ భయపడి ఉండొచ్చని ఫెలోసీ తెలిపారు.
40 ఏళ్లుగా తైవాన్ వివాదం సాగుతోంది. ఈ ద్వీప దేశాన్ని తమదిగా చైనా చెబుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత చైనాలో చైనా కమ్యూనిస్టు పార్టీ, నేషనలిస్టు పార్టీ ప్రభుత్వం మధ్య వివాదాలు తలెత్తాయి. 1949లో చైనా కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించడంతో మావో జిడాంగ్ అధికారం చేపట్టారు. దీంతో నేషనలిస్టు పార్టీ నేతలు తైవాన్‌కు పారిపోయారు. అప్పటి నుంచి తైవాన్‌లో నేషనలిస్టు పార్టీ పుంజుకుంది. ఆ తరువాత స్వతంత్ర దేశంగా తైవాన్ ప్రకటించుకుంది. తైవాన్‌ను 13 దేశాలు అధికారికంగా గుర్తిస్తున్నాయి. చైనా మాత్రం తైవాన్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించొద్దని ఆయా దేశాలపై ఒత్తిడి తెస్తోంది. తైవాన్ చుట్టూ నిత్యం సైన్యాన్ని మోహరిస్తూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తోంది. చైనా సైనిక శక్తి ముందు తైవాన్ చాలా బలహీనమైనది. తైవాన్‌పై చైనా దాడి చేస్తే అమెరికా సైన్యం రంగంలోకి దిగుతుందని ఇటీవల జరిగిన క్వాడ్ సదస్సు సందర్భంగా జో బైడెన్ హెచ్చరించారు. అయితే రంగంలోకి అమెరికా దిగడంతో ప్రపంచ దేశాల నుంచి సహాయం అందుతుందని తైవాన్ భావిస్తోంది.
అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధంతో పలు దేశాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు చైనా యుద్ధానికి దిగితే మాత్రం ప్రపంచ దేశాలు మాంద్యంలో చిక్కుకోనున్నాయి. అయితే యుద్ధంతో రష్యా తీవ్రంగా దెబ్బతిన్నదని అది చూసైనా చైనా యుద్ధానికి దిగకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.