ఇండోనేషియాలో గల్లంతైన విమానం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించిన అధికారులు విమానం సిగ్నల్స్ నుంచి సంబంధాలు తెగిపోయిన ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇండోనేషియా రాజధాని జకర్తా నుంచి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నాలుగు నిమిషాలకే రాడార్‌కు చిక్కకుండా అదృశ్యమైంది. చివరగా 2 గంటల 40 నిమిషాలకు విమానం నుంచి సిగ్నల్స్ అందినట్లు చెబుతున్నారు అధికారులు. ఆ సమయంలో జావా సముద్రం ప్రాంతంలో పదివేల అడుగుల ఎత్తులో విమానం ఉందని తెలిపారు. అయితే విమానం సముద్రంలో కుప్పకూలి పోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండోనేషియాలో కేటగిరీ వన్ ఎయిర్‌లైన్స్‌గా పేరుపడిన శ్రీ విజయకు చెందిన అదృశ్యం అవడంపై ప్రయాణికుల బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన విమానంలో 56 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నట్లు తెలిపారు అధికారులు. ప్రయాణికులతో పాటు ఆరుగురు ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా ఉన్నారు.