17 మంది మంత్రులతో కొత్త కేబినెట్.. మంత్రుల జాబితాను ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్సే
Sri Lanka: విపత్కర పరిస్థితుల్లో కొత్త వారిని నియమిస్తే ప్రజలు ఏం చేస్తారని నిలదీస్తున్న ప్రతిపక్షాలు
Sri Lanka: శ్రీలంకను ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. దేశంలో దారుణ పరిస్థితులకు కారణమైన ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దిగిపోవాలంటూ ప్రజలు నిత్యం ఆందోళన చేస్తున్నారు. దిగిపోయేది లేదంటూ రాజపక్సే కుటుంబం భీష్మిస్తోంది. తాజాగా శ్రీలంక కొత్త కేబినెట్‌ను రాజపక్సే ప్రకటించారు. 17 మంది మంత్రులను నియమిస్తూ దేశాలను జారీ చేశారు. మంత్రి పదవులనేవి ప్రత్యేక సౌకర్యాల కోసం కాదని సంక్షోభ సమయంలో ఇదొక బాధ్యత అని గొటబాయ తెలిపారు. నీతి, నిజాయితీగా పని చేసే వారిని మంత్రులుగా నియమించామని వారు ప్రజలు మెరుగ్గా సేవలందిస్తారని చెప్పారు. ప్రస్తుత సంక్షోభంలో ప్రభుత్వ రంగ సంస్థలు తీవ్రంగా కష్టాల్లో కూరుకుపోయాయని వాటిని మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత కూడా కొత్త మంత్రులకు సహకరించాలని గొటబాయ కోరారు. అయితే కొత్త మంత్రుల నియామకంపై ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. విపత్కర పరిస్థితులున్న ప్రస్తుత తరుణంలో అనుభవం లేని వారు మంత్రులుగా ఏం చేస్తారని ప్రశ్నించాయి.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, ప్రజాగ్రహం నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో ఆ దేశ కేబినెట్ మొత్తం రాజీనామా చేసింది. ఆ తరువాత అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పిలుపునిచ్చారు. అయితే ఆయన ఆఫర్‌ను విపక్షాలు తిరస్కరించాయి. మరోవైపు గొటబాయ రాజీనామాను డిమాండ్ ప్రజలు ఆందోళనలు ఉధృతం చేశారు. అధ్యక్షుడి అధికార పరిధిని నిరోధించాలని విశేషాధికారులు కల్పించిన రాజ్యంగ సవరణ 20ను రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతామని ప్రధాన ప్రతిపక్ష నేత ప్రేమదాస హెచ్చరించారు. అయినా రాజపక్సే మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా 17 మంది కొత్త మంత్రులను నియమించారు. కొత్త మంత్రులు ఇవాళ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు శ్రీలంక పార్లమెంట్ సమావేశం జరగనున్నది. ఈ నేపథ్యంలో విపక్షాలు ఆందోళనకు దిగే అవకాశం ఉంది. లేదంటే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.