శ్రీలంకలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు.. రాజపక్సే నివాసంతో పాటు పలువురి ఇళ్లకు నిప్పు
Sri Lanka: ప్రధాని పదవికి రాజీనామా చేసిన రాజపక్సే
Sri Lanka: శ్రీలంకలో నెలకొన్న సంక్షోభం అదుపు తప్పింది. తీవ్ర నిరసనలకు అల్లర్లకు దారి తీసింది. నిట్టంబువాలో జరిగిన అల్లర్లలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి, అతని వ్యక్తిగత భద్రతాధికారి చనిపోయారు. సమస్య పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన సెగలు ఎగిసిపడ్డాయి. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, అధికార నేతలు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు, ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనల నేపథ్యంలో ప్రధానమంత్రి మహింద రాజపక్స వెనక్కితగ్గారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే అందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాజపక్స వెల్లడించారు. ప్రధాని రాజీనామాతో కేబినెట్ కూడా రద్దు కానుంది. ఈ అల్లర్ల భయానికి రాజపక్సే కుటుంబసభ్యలు దేశం విడిచి వెళ్లిపోవాలనుకుంటున్నారు.
గొటబాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనల్లో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. కొలంబోలో ప్రధాని రాజపక్స నివాసం భవనం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేయడంతో శ్రీలంక ఒక్కసారిగా భగ్గుమంది. ఇరు వర్గాల ఘర్షణలతో కొలంబో నగరం అట్టుడికింది. ప్రభుత్వ వ్యతిరేక, అనుకూల నినాదాల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్, జల ఫిరంగులు ప్రయోగించారు.
ఇటు దేశమంతటా అధికార పార్టీ నేతలకు నిరసన సెగలు తగులుతున్నాయి. పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లు,ఆఫీసులపై ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. మౌంట్ లావినియాలోని మాజీ మంత్రి జాన్సన్ ఫెర్నాండో నివాసం, ఎంపీ సనత్ శాంత ఇంటిపై నిరసనకారులు దాడి చేశారు. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో ఒక ఎంపీతో సహా ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 189 మందికి గాయాలు అయ్యాయి.