Sri Lanka Crisis Live Updates: ఎట్టకేలకు రాజీనామా చేసిన గొటబయ రాజపక్స
Sri Lanka Crisis Live Updates: సింగపూర్ చేరుకున్న తరువాత గొటబయ రాజీనామా
Sri Lanka Crisis Live Updates: శ్రీలంకలో ప్రజాగ్రహానికి గురైన అధ్యక్షుడు గొటబయ ఎట్టకేలకు రాజీనామా చేశారు. నిన్న మధ్యాహ్నం తరువాత రాజీనామా చేస్తానని చెప్పినా 24 గంటల తరువాత కూడా ఆ జాడలేవీ కనిపించలేదు. అయితే అధ్యక్షుడి హోదాలో మాల్దీవులకు చెక్కేసిన గొటబయ సింగపూర్ మీదుగా యూఏఈకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. మార్గమధ్యంలో సింగపూర్లో ల్యాండ్ అయిన గొటబయ.. కాసేపటి క్రితమే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శ్రీలంక స్పీకర్ కు పంపించారు. దీంతో ఆయన ఇప్పుడు పదవి లేని సామాన్య పౌరుడిగా సింగపూర్లో ఆశ్రయం పొందుతున్నట్టయింది. అయితే సింగపూర్ ప్రభుత్వం మాత్రం.. తమను గొటబయ ఆశ్రయం అడగలేదని క్లారిటీ ఇవ్వడం విశేషం.
దేశంలో అల్లర్లు చెలరేగుతుండగానే గొటబయ ప్రత్యేక విమానంలో మాల్దీవులకు చెక్కేశాడు. మాల్దీవుల్లోని మాలేలో తన భార్య, ఇద్దరు బాడీగార్డులతో వాలిపోయి సురక్షితంగా ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాడు. టూరిస్టులను ఆకర్షించడంలో మాల్దీవులకు ప్రత్యేకమైన అంశాలెన్నో ఉన్నాయి. అయితే ప్రజల కళ్లుగప్పి మాల్దీవులకు చేరిన గొటబయకు అక్కడ కూడా నిరసన జ్వాలలే స్వాగతం పలికాయి. అక్కడ ఉంటున్న సింహళీయులు తమ దేశాన్ని మోసపుచ్చి మాల్దీవులకు వచ్చావా అంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇది ఆ ప్రభుత్వానికి కూడా ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆయన భార్యతో పాటు సింగపూర్ వెళ్లేందుకు పథకరచన చేసుకున్నారు. అక్కడి నుంచి యూఏఈకి ఎప్పుడు వెళ్లేది ఇప్పటికైతే క్లారిటీ లేని అంశంగా మిగిలింది. కాకపోతే ఆయన మాల్దీవుల్లోనే ప్రత్యేకమైన ఫ్లయిట్ ఏర్పాటు చేసుకొని సింగపూర్ మీదుగా యూఏఈకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
మరోవైపు శ్రీలంకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆల్ పార్టీ మీట్ నిర్వహించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గాన్వేషణ చేస్తానని అంటున్నా.. ప్రజలెవరూ ఆయన్ని నమ్మడం లేదు. అంతేకాదు అటు ప్రతిపక్షాలు కూడా ఇప్పుడున్న పాలకుల మాటలు, నిర్ణయాలు ఏమాత్రం పనికిరావని భీష్మించుకున్నాయి. 20వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్న విక్రమ సింఘే అందుకు అనుకూలమైన వాతావరణం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ లోగా ఏం జరుగుతుందన్నది కూడా ప్రశ్నార్థకంగానే మారింది.
శ్రీలంక సంక్షోభానికి ఇంకా శుభం కార్డు పడలేదు. అలాగని ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగిందా అంటే అది కూడా లేదు. దేశంలో పరిస్థితులపై ఆగ్రహించిన ప్రజలంతా మూకుమ్మడిగా పాలకుల అధికార నివాస గృహాలపై విరుచుకుపడ్డారు. తమ కోపాన్ని, కసిని, దేశానికి ఈ లెవల్లో పట్టించిన దుర్గతిని జీర్ణించుకోలేని పౌరులు పాలకుల ఇళ్లను ఆక్రమించుకున్నారు. పార్లమెంట్ భవనాన్ని, అధ్యక్షుడి ఇంటిని, ప్రధానమంత్రి ఇంటిని, అధికారిక న్యూస్ చానల్ ను కబ్జా చేసుకున్నారు. జనమంతా ఒక్కసారిగా విరుచుకుపడడంతో సైన్యం కూడా ఎటూ పాలుపోని స్థితిలో ఉండిపోయింది. సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్న ప్రతిపక్షం కారణంగా సైన్యానికి కూడా సరైన ఆదేశాలు జారీ చేయలేని పరిస్థితి నిన్నటివరకూ తలెత్తింది. అయితే పరిస్థితులను అదుపు చేయకపోతే.. ప్రజాగ్రహం చేయిదాటే సంకేతాలు కనిపించడంతో తాత్కాలిక అధ్యక్షుని హోదాలో ఉన్న రణిల్ విక్రమసింఘే ఓ హెచ్చరిక జారీ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేందుకు ఎవరు ప్రయత్నించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే పరిధిదాటిన ఆందోళనకారుల్ని కాల్చిపారేయాలని ఆదేశించారు. దేశమంతా ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు ఉపక్రమించింది. దేశమంతా కర్ఫ్యూ అమల్లో ఉంది.
నిన్న రోడ్ల మీదికొచ్చిన జనాన్ని సైన్యం ఒకింత సహనంగానే డీల్ చేశారు. అయితే ఆగ్రహంతో వచ్చిన ప్రజల్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ గోళాలు ప్రయోగించారు. లాఠీలు ఝళిపించారు. ప్రజా సమూహాల్ని నిరోధించేందుకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ వద్ద, ప్రధాని అధికార నివాసం, ఆయన స్వగృహం వద్ద భారీ ఎత్తున దళాలు మోహరించాయి. అయినా ఆగ్రహం చల్లారని ప్రజలు పార్లమెంట్ వైపు దూసుకురావడంతో సైన్యం చేతులకు పని చెప్పాల్సి వచ్చింది. ప్రజలు, సైన్యం మధ్య ఘర్షణలో దాదాపు 50 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డవారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ పార్లమెంట్ హౌస్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పటిష్టమైన బ్యారికేడ్లు, సాయుధులైన దళాలు, చీమ చిటుక్కుమన్నా ట్రిగ్గర్ నొక్కేలా పూర్తి సంసిద్ధులై ఉన్న సైనికులే కొలంబోలో ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు.
ఇక శ్రీలంక సంక్షోభంలో ఓ కీలకమైన అంశం చర్చకు దారి తీస్తోంది. నిన్న వేలాదిమంది ప్రభుత్వాధికార నివాసాలను కబ్జా చేసుకున్నా కూడా.. తమ ఆగ్రహావేశాలు ప్రదర్శించారే తప్ప.. ఉద్యమం అరాచక శక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. తమ చేతికి చిక్కిన అధ్యక్ష భవనాన్ని, ఆయన సొంత ఇంటిని, ప్రధానమంత్రి నివాసాన్ని పార్లమెంట్ హౌజ్ ను ఎంతో బాధ్యతగా సైనికులకు అప్పగించినట్లు వస్తున్న వార్తలపై మేధావులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో అనేక ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ఆందోళనలు అదుపు తప్పడం చూస్తున్నదే. అందుకు భిన్నంగా శ్రీలంకలో ఆందోళనకారులు మాత్రం తమ చేతికి చిక్కిన ప్రభుత్వ భవనాలను మళ్లీ సైన్యం కంట్రోల్ కి అప్పగించడం చర్చనీయాంశంగా మారింది.