షేక్ హసీనా, రాజపక్స… ఇంకా మరెందరో? ప్రజాగ్రహానికి జడిసి పారిపోయిన పాలకుల చరిత్ర ఇది

Tale of ousted leaders: అభిమానిస్తే అందలం ఎక్కిస్తారు. తేడా వస్తే గద్దె దిగేవరకు పోరాటం చేస్తారు. ప్రజల పోరాటంతో పలు దేశాల్లో పాలకులు గద్దె దిగితే.. మరికొందరు దేశం విడిచి పారిపోయారు. షేక్ హసీనా నుంచి రాజపక్సే వరకు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

Update: 2024-08-14 03:30 GMT

షేక్ హసీనా, రాజపక్స… ఇంకా మరెందరో? ప్రజాగ్రహానికి జడిసి పారిపోయిన పాలకుల చరిత్ర ఇది

అభిమానిస్తే అందలం ఎక్కిస్తారు. తేడా వస్తే గద్దె దిగేవరకు పోరాటం చేస్తారు. ప్రజల పోరాటంతో పలు దేశాల్లో పాలకులు గద్దె దిగితే.. మరికొందరు దేశం విడిచి పారిపోయారు. షేక్ హసీనా నుంచి రాజపక్సే వరకు ఈ అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.


 హసీనాకు ఎసరు తెచ్చిన రిజర్వేషన్ల పోరాటం

షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేయడానికి సివిల్ సర్వీస్ రిజర్వేషన్ల అంశం కారణమైంది. మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ తో చేసిన ఆందోళనలు హింసకు కారణమయ్యాయి. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేశం విడిచి భారత్ లో ప్రస్తుతం తలదాచుకుంటున్నారు.


 పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన గోటబయ రాజపక్సే ప్రజల నిరసనలను తట్టుకోలేక దేశం విడిచి పారిపోయారు. 2019 నవంబర్ నుంచి 2022 జూలై వరకు ఆయన శ్రీలంక అధ్యక్షులుగా పనిచేశారు. అప్పట్లో అక్కడ తీవ్ర ఆర్ధిక సంక్షోభం తలెత్తింది. దీన్ని పరిష్కరించేందుకు ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘేతో కలిసి ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనలను అణచివేసేందుకు ప్రయత్నించారు. కానీ, రోజు రోజుకు ఇవి తీవ్రరూపం దాల్చాయి. చివరకు అధ్యక్షుడి ఇంటిపై కూడా ప్రజలు దాడికి దిగారు. అధ్యక్షుడి అధికార భవనంలో దొరికిన వస్తువులను తీసుకెళ్లారు. నిరసనకారులు దాడి చేయడానికి ముందే అధ్యక్షుడిని భద్రతా సిబ్బంది సురక్షితంగా తప్పించారు.


 పర్వేజ్ ముషారఫ్ కు తప్పని పలాయనం

ఫర్వేజ్ ముషారఫ్ 2001 నుంచి 2008 వరకు పాకిస్తాన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ గందరగోళాల మధ్య ఆయన 2008లో దేశం విడిచి పారిపోయారు. 1999లో సైనిక తిరుగుబాటు ద్వారా అప్పటి ప్రధాని షరీప్ ను పదవి నుంచి ఆయన దింపారు.

2001లో దేశాధ్యక్షుడు కావడానికి ఈ ఘటన ఆయనకు కలిసి వచ్చింది. మానవ హక్కుల ఉల్లంఘన, రాజకీయ, న్యాయవ్యవస్థపై అణచివేతల వంటి ఆరోపణలు ముషారఫ్ పై వచ్చాయి. మరోవైపు 2007లో అతను అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాజ్యాంగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టును తొలగించారు.

అభిశంసన ప్రక్రియను తప్పించుకొనేందుకు ముషారఫ్ 2008 లో అధ్యక్ష పదవికి రాజీనామా చేసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి దుబాయ్ చేరుకున్నారు. మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్యతో పాటు పాకిస్తాన్ లో అనేక అంశాలకు సంబంధించి న్యాయపరమైన సవాళ్లను ఆయన ఎదుర్కొన్నారు. 2013 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. కొంతకాలం ముషారఫ్ హౌస్ అరెస్టయ్యారు. 2023 ఫిబ్రవరి 5న ఆయన దుబాయ్ లో కన్నుమూశారు.


 సైనిక తిరుగుబాటుతో పారిపోయిన హైతీ అధ్యక్షుడు అరిస్టైడ్

జీన్ బెర్ట్రాండ్ అరిస్టైడ్ హైతీ అధ్యక్షుడిగా 1991లో ఎన్నికయ్యారు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. హైతీలోని సంపన్నులు ప్రధానంగా వ్యాపారులు, సైనికులు అరిస్టైడ్ తెచ్చిన సంస్కరణలను వ్యతిరేకించారు.

తన సన్నిహిత మిత్రుడు రెనే ప్రేవల్‌ని ప్రధానమంత్రిగా ప్రతిపాదించారు. ఇది రాజకీయంగా తీవ్రంగా విమర్శలకు కారణమైంది. ఆర్మీ జనరల్ రౌల్ సెడ్రాస్ నేతృత్వంలో 29 సెప్టెంబరు 1991లో సైన్యం అరిస్టైడ్ ను పదవి నుంచి దింపింది.

సైన్యం కమాండర్ ఇన్ చీఫ్ గా సెడ్రాస్ నియమితులయ్యారు. అమెరికా, ఫ్రెంచ్ ,వెనిజులా దౌత్యవేత్తల జోక్యంతో అరిస్టైడ్ ప్రాణాలు దక్కాయి. పదవి నుంచి దిగిపోయిన తర్వాత అరిస్టైడ్ తొలుత వెనిజులా ఆ తర్వాత అమెరికాలో తలదాచుకున్నారు. ఆ తర్వాత అంతర్జాతీయ సమాజం ఒత్తిడి మేరకు ప్రధానంగా అమెరికా జోక్యంతో 15 అక్టోబరు 1994న, అరిస్టైడ్ తిరిగి హైతీకి చేరుకున్నారు.

2001లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అరిస్టైడ్ తన రాజకీయ ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురి చేసేందుకు వీధి ముఠాలపై ఎక్కువగా ఆధారపడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ఆర్ధిక సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేసింది. మరో వైపు దేశం అరిస్టైడ్ అనుకూల, వ్యతిరేక వర్గాలు విడిపోయి ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

దీనికి తోడు 2004 ప్రారంభంలో మాజీ మిలిటరీ, పోలీసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించారు. ఈ పోరాటం అనతికాలంలోనే పుంజుకుంది. అరిస్టైడ్ అనుకూల వర్గం వ్యతిరేక వర్గాన్ని అణచివేసేందుకు యత్నించింది. కానీ, తిరుగుబాటుదారులదే పైచేయిగా మారింది. తిరుగుబాటుదారులు తొలుత దేశంలోని ఉత్తరాదిపై నియంత్రణ సాధించారు. చివరికి రాజధానిని ఆక్రమించారు. దీంతో అరిస్టైడ్ 28 ఫిబ్రవరి 2004న దేశాన్ని వీడాల్సి వచ్చింది. ఏడేళ్ల ప్రవాసం తర్వాత 2011లో తిరిగి హైతీకి వచ్చారు.


 తాలిబన్ల తిరుగుబాటుతో పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆస్రఫ్ ఘని

తాలిబన్ల సాయుధ పోరాటం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆస్రఫ్ ఘని దేశం విడిచి పారిపోయేలా చేసింది. 2014 సెప్టెంబర్ నుంచి 2021 ఆగస్టు వరకు ఆయన దేశాధ్యక్షుడిగా పనిచేశారు. 2021 ఆగస్టు 15న తాలిబన్లు కాబూల్ నగరానికి సమీపించిన విషయం తెలుసుకున్న ఆస్రఫ్ ఘని ఆ దేశం విడిచి పారిపోయారు.

తన ప్రాణాలకు ముప్పుందని భద్రత సిబ్బంది వార్నింగ్ ఇచ్చినందునే తాను దేశాన్ని వీడినట్టుగా అప్పట్లో ఆయన ఓ వీడియో సందేశం పంపారు. దేశం విడిచివెళ్లే సమయంలో భారీగా నగదును తీసుకెళ్లినట్టుగా తనపై వచ్చిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాలిబన్లకు ధీటుగా సమాధానం చెబుతామన్న ఘనీ ఆ తర్వాత చేతులెత్తేశారు. రక్తపాతం వద్దనుకొనే అధికార మార్పిడి చేయాల్సి వచ్చిందన్నారు.


 సైనిక తిరుగుబాటుకు తలవంచిన సూడాన్ ప్రధాని సాదిక్ అల్ మహ్ది

సాదిక్ అల్ మహ్ది 1966 నుంచి 1967 వరకు మళ్లీ 1986 నుండి 1989 వరకు సూడాన్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. రాజకీయ, ఆర్థిక సవాళ్లతో ఆయన దేశం నుండి పారిపోయారు.మొదటగా 1966లో ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆ సమయంలో ప్రాంతీయ అభివృద్ధికి, దక్షిణ ప్రావిన్సులకు ఎక్కువ స్వయంప్రతిపత్తికి మద్దతు ఇచ్చాడు. ఈ ప్రతిపాదనలు చాలా మంది విద్యావంతులైన సూడానీస్ పౌరులు, ఆర్మీ అధికారులకు నచ్చలేదు.

అదే సమయంలో తనకు మద్దతిచ్చే సంకీర్ణ పార్టీల మద్దతును కూడా ఆయన కోల్పోయారు. దీంతో మే 1967లో, సాదిక్ ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంది. చివరకు 1974లో ఆయనను దేశం నుంచి బహిష్కరించారు. 1977లో రాజకీయ ఖైదీలను విడిపించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో ఆయన తిరిగి స్వదేశానికి వచ్చారు.

1986లో జరిగిన ఎన్నికల్లో సాదిక్ రెండోసారి సూడాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. అంతర్యుద్దం, ఆర్ధిక సంక్షోభం సాదిక్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసింది. 30 జూన్ 1989న, బ్రిగేడియర్ ఒమర్ అల్-బషీర్ నేతృత్వంలోని తిరుగుబాటుతో ప్రభుత్వం కూలిపోయింది.

. తన పదవి పోవడానికి కారణమైన బషీర్ కు వ్యతిరేకంగా సాదిక్ వ్యతిరేక పోరాటం సాగించారు. ఈ సమయంలో కొంతకాలం ప్రవాస జీవితం గడిపారు. చివరికి నవంబర్ 2018లో సుడాన్‌కు తిరిగి వచ్చారు. అనేక ఆరోపణలపై ఆయన అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత 2019లో మరోసారి ఆయన దేశాన్ని వీడారు. 2020లో ఆయన మరణించారు.

ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన నాయకులు ప్రజల మనసుల్లో నిలిచిపోతారు. కానీ, అందుకు విరుద్దంగా వ్యవహరించిన ఎంత గొప్ప నాయకులైనా ప్రజాగ్రహనికి గురికాక తప్పదని చరిత్ర చెబుతోంది.

Tags:    

Similar News