Pakistan-Saudi: విదేశీ కుట్ర వల్లే పదవి కోల్పోయానంటూ ఆవేదన చెందిన పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి చుక్కులు చూపించే ప్రయత్నం చేస్తోంది సౌదీ. అమెరికా కుట్ర వల్లే తన పదవి పోయిందని బాహాటంగా విమర్శలు గుప్పిస్తున్న ఇమ్రాన్‌కు ఇక కష్టాలు తప్పేలా లేవు. ప్రజల మద్దతుతో వీలైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న ఖాన్‌కు కంటి మీద కనుకు లేకుండా చేసే ఎత్తుగడ అమలవుతోంది. తెర వెనుక నుంచి ఆర్మీ రంగం ప్రవేశం పరోక్షంగా అమెరికా సహాకరంతో ఇటీవల ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన షెహబాజ్ షరీఫ్ పీఠంపై పూర్తి కాలం కొనసాగేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఇమ్రాన్ ఖాన్ పదవీ విచ్యుతుడు కావడంతో పాకిస్తాన్‌కు సౌదీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మొన్నటి వరకు పాక్ పై గుస్సాగా ఉన్న అరబ్ మిత్రుడు ఆ దేశ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ టూర్‌లో వరాల జల్లు కురిపించాడు. షెహబాజ్ షరీఫ్ సౌదీ పర్యటన సమయంలో పాకిస్తాన్‌కు సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ 8 బిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీలో చమురు కొనుగోళ్లకు సంబంధించి రుణ సదుపాయాన్ని సౌదీ డబుల్ చేస్తోంది. మిగతా మొత్తాన్ని డిపాజిట్లు, సుకుక్స్ ద్వారా అందించనున్నట్టు ది న్యూస్ ఇంటర్నేషనల్ పేర్కొంది. సౌదీ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ జాయెద్‌తో మొత్తం వ్యవహారంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చర్చించారు.
ఆర్థిక మాంద్యంతో సతమతమవుతున్న పాకిస్థాన్, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ పర్యటన సందర్భంగా సౌదీ అరేబియా నుండి సుమారు 8 బిలియన్ డాలర్ల ప్యాకేజీ భారీ ఉపశమనంగా భావించాలి. అయితే ఈ మొత్తం రావడానికి సౌదీ అనేక కండీషన్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఆర్థిక కల్లోలంతో సతమతమవుతున్న పాకిస్తాన్ ఎవరు సాయం చేస్తారా అంటూ గత కొంతకాలంగా ఎదురు చూస్తోంది. మొత్తం ఎగ్రిమెంట్‌ను వేగంగా కుదుర్చుకునేందుకు పాక్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ సౌదీలోనే తిష్టవేశారు.
ప్రస్తుతం చమురు కొనుగోలుకు సంబంధించి 1.2 బిలియన్ డాలర్లుగా ఉన్న రుణాన్ని 2.4 బిలియన్ డాలర్లకు పెంచింది సౌదీ. పాకిస్తాన్, అరేబియా రాజ్యం డిపాజిట్లు లేదా సుకుక్ ద్వారా 2 బిలియన్ల అమెరికా డాలర్ల అదనపు ప్యాకేజీ ద్వారా నగదు నిల్వలు అందుబాటులోకి రానున్నాయ్. డిసెంబర్ 2021లో సౌదీ అరేబియా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్‌కు $3 బిలియన్ల డిపాజిట్లను అందించి ఆర్థిక వ్యవస్థ పతనం కాకుండా అడ్డుకొంది.
ఇమ్రాన్ ఖాన్ నాలుగేళ్ల పాలనలో సౌదీ అరేబియా పాకిస్తాన్‌కు $4.2 బిలియన్ల ప్యాకేజీ మాత్రమే అందించింది. 3 బిలియన్ల డిపాజిట్లు కాగా $1.2చమురు కోసం రుణాన్ని మంజూరు చేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, విస్తరిస్తున్న కరెంట్ ఖాతా లోటు, అధిక ఆర్థిక లోటు నేపథ్యంలో సౌదీ సాయం పాకిస్తాన్ కు కొండంత బలాన్నిస్తోందని చెప్పొచ్చు. మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ పాలనలో స్పందించని విదేశాలు ఇప్పుడు షరీఫ్ కు సంపూర్ణ మద్దతివ్వడంపై పీటీఐ నేతలు మండిపడుతున్నారు. ఇదంతా విదేశీ కుట్ర అంటూ తేల్చేస్తున్నారు.