రచయిత సల్మాన్ రష్దీకి వెంటిలేటర్‌పై చికిత్స
Salman Rushdie: ఓ కన్ను కోల్పోయే ప్రమాదం
Salman Rushdie: ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అమెరికాలోని న్యూయార్క్‌లో రష్దీపై ఓ ఆగంతకుడు కత్తితో పైశాచికంగా దాడి చేశాడు. మెడ, ఉదర భాగంలో తీవ్రంగా గాయపడిన రష్దీ.. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన ఓ కన్ను కోల్పోయే ప్రమాదముందని రష్దీ ప్రతినిధి ఆండ్రూ వైలీ తెలిపారు. కత్తిపోట్ల వల్ల లివర్ కూడా దెబ్బతిన్నట్టు చెప్పారు. మోచేతి దగ్గర నరాలు ఛిద్రమయ్యాయన్నారు. అయితే.. రష్దీపై దాడికి పాల్పడిన దుండగుడిని 24 ఏళ్ల హాదీ మతార్‌గా గుర్తించారు.
అతను ఇరాన్ అనుకూల భావాలున్న వ్యక్తిగా చెబుతున్నారు. అతను ఓ ఫేక్ ఐడీ కార్డుతో సాహితీ సదస్సులోకి ఎంట్రీ ఇచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాగా సల్మాన్ రష్దీ భారత సంతతికి చెందిన రచయిత. ఆయన రచించిన ది సటానిక్ వెర్సెస్ నవల.. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఛాందసవాదుల ఆగ్రహానికి గురైంది. రష్దీని హత్య చేయాలంటూ గతంలో ఇరాన్ మహానేత ఆయతొల్లా ఖొమేనీ ఫత్వా కూడా జారీ చేశారు. ఈ క్రమంలో రష్దీపై హత్యాయత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.