రష్యా రాయబారి సెర్గీకి చుక్కలు చూపించిన ప్రజలు
పోలాండ్‌లో రష్యా రాయబారిపై రెడ్ పెయింట్‌తో దాడి
Russian Ambassador: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతున్న కొద్దీ రష్యాకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయ్. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ రష్యాను ఏకాకి చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఇప్పుడు యూరప్ లోని కొన్ని దేశాల్లో రష్యా రాయబారులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయ్. రష్యా మీద ఉన్న కోపంతో ఆదేశ రాయబారిపై దాడికి దిగిన ఘటన పోలాండ్‌లో జరిగింది.విక్టరీ డే ఈవెంట్‌లో పాల్గొనేందుకు వచ్చిన రష్యా రాయబారిపై రెడ్ పెయింట్‌తో దాడి కలకలం రేపింది.
రెండో ప్రపంచ యుద్ధం ముగింపును గుర్తుచేసే ఏటా నిర్వహించే విక్టరీ డే కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకొంది. సోవియట్ సోల్డర్స్ స్మశానవాటిక ముందు నిరసనకారులు, రాయబారిపై దాడికి దిగారు. పోలాండ్ లోని రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్, వార్సాలోని సైనికుల స్మశాన వాటికలో నివాళులు అర్పించడానికి రావడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయ్. స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు.
తక్షణం అక్కడ్నుంచి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. రష్యా రాయబారి ముఖం మీద నిరసన కారులు ఎరుపు రంగు పెయింట్‌తో దాడికి దిగారు. తక్షణం వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో పొలాండ్ రష్యాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అమెరికా సూచించినట్టుగా, ఉక్రెయిన్‌కు దన్నుగా నిలుస్తోంది. దీంతో అక్కడ రష్యా ప్రజల భద్రత పోలాండ్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది.