Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్న రష్యా

Russia - Ukraine War: రష్యాపై ఆంక్షలు కట్టుదిట్టం చేస్తున్న ప్రపంచ దేశాలు...

Update: 2022-03-13 02:00 GMT

Russia - Ukraine War: ఉక్రెయిన్‌పై భీకరంగా విరుచుకుపడుతున్న రష్యా

Russia - Ukraine War: ఎలాగైనా ఉక్రెయిన్‌పై పట్టు సాధించాలనుకుంటున్న రష్యా ఎంత మాత్రం వెనక్కి తగ్గకుండా బాంబులు, రాకెట్లను సంధిస్తోంది. గడ్డ కట్టించే చలిలోనూ అడుగు ముందుకు వేసే పంతంతో పావులు కదుపుతోంది. మేరియుపొల్‌ నగరంలో 34 మంది పిల్లలు సహా దాదాపు 86 మంది టర్కీ పౌరులు తలదాచుకున్న ఒక మసీదుపై రష్యా సేనలు బాంబులు కురిపించాయి. రాజధాని కీవ్‌పై, ఆ నగర శివార్లలోని పలు ప్రాంతాలపై దాడులు చోటుచేసుకున్నాయి. మైకొలైవ్‌ నగరంలో ఒక కేన్సర్‌ ఆసుపత్రిని, అనేక నివాస భవనాలను రష్యా సేనలు ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ వర్గాలు తెలిపాయి.

కీవ్‌పై దండయాత్రకు కిలోమీటర్ల పొడవైన వాహన శ్రేణితో బయల్దేరి కొంత దూరంలో ఆగిన రష్యా సేనలు క్రమంగా ముందుకు వస్తున్నాయి. ప్రతిఘటనను అణచివేయడానికి సిరియా, చెచెన్యా వంటిచోట్ల నింగి నుంచి, నేల నుంచి అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు ఉక్రెయిన్‌ విషయంలోనూ రష్యా పాటిస్తోంది. కీవ్‌ సమీపంలోని ఆయుధ గోడౌన్‌పై దాడుల తర్వాత దాని ప్రభావానికి వందల సంఖ్యలో చిన్నస్థాయి పేలుళ్లు సంభవించాయి. మృతదేహాలను పూడ్చిపెట్టడానికైనా విరామం ఇవ్వని రీతిలో దాడులు కొనసాగుతున్నాయి. ఖర్కివ్‌ను కూడా సేనలు చుట్టుముడుతున్నాయి.

రష్యాను కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తున్నా, ఆ దేశ సేనలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. బాంబు దాడులతో ఉక్రెయిన్‌లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. మెలిటొపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం.. ఆ నగర మేయర్‌ను అపహరించుకుపోయినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. శత్రు సైనికులకు సహకరించట్లేదనే ఉక్రోషంతో ఇలా చేసినట్లు తెలిపారు. రష్యా ఉగ్రవాదం కొత్త దశలోకి మారింది.

చట్టబద్ధ ప్రతినిధులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ఇది ఐసిస్‌ ఉగ్రవాదుల చర్యకంటే తక్కువేం కాదని మండిపడ్డారు. ఇప్పటివరకు 1,300 మంది ఉక్రెయిన్‌ సైనికులు ఈ యుద్ధంలో చనిపోయారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జర్మనీ ఛాన్స్‌లర్‌, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫోన్లో మాట్లాడి, యుద్ధాన్ని తక్షణం విరమించాలని కోరారు. జెలెన్‌స్కీతో కూడా షోల్జ్‌ విడిగా ఫోన్లో మాట్లాడారు. పుతిన్‌తో జెరూసలెంలో సమావేశమయ్యేందుకు జెలెన్‌స్కీ ప్రతిపాదించారు. మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా ఇజ్రాయెల్‌ ప్రధాని బెన్నెట్‌ను కోరారు.

Tags:    

Similar News