Russia-Ukraine: దూసుకుపోతున్న రష్యా బలగాలు

Russia-Ukraine: రష్యా దాడులను తిప్పికొట్టేందుకు శ్రమిస్తున్న ఉక్రెయిన్

Update: 2022-02-25 03:38 GMT

Russia-Ukraine: దూసుకుపోతున్న రష్యా బలగాలు

Russia-Ukraine: ఏది జరగడకూడదని ప్రపంచం మొత్తం భావించిందో..ఇప్పుడు అదే జరుగుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయింది. ఉక్రెయిన్‌పై రష్యా ఉక్కుపాదం మోపుతోంది. రాజధాని కీవ్ సహా అన్ని ప్రధాన నగరాలపై బాంబుల వర్షం కురిపించింది. ముఖ్యంగా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. వైమానిక దాడులతో పాటు సరిహద్దుల నుంచి యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్‌లోకి తరలిస్తోంది రష్యా. అంతేకాదు పెద్ద ఎత్తున పారా ట్రూపర్‌లను రంగంలోకి దించింది. నలువైపుల నుంచి ఉక్రెయిన్‌ను చుట్టుముట్టి ముప్పేట దాడి చేస్తోంది.

తొలుత గగనతలం ద్వారా విరుచుకుపడ్డ రష్యా తన సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపించింది. తర్వాత క్రిమియా మీదుగా భూభాగం ద్వారా సైనిక వాహనాల్లో బలగాలను తరలించింది. బెలారస్‌ నుంచి రష్యా దాడి మొదలైందని ఉక్రెయిన్‌ సరిహద్దు భద్రత సంస్థ తెలిపింది. కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థలన్నింటినీ తుడిచిపెట్టేశామని రష్యా సైన్యం ప్రకటించింది. వైమానిక దాడుల్లో ఇప్పటికే ఉక్రెయిన్‌కు చెందిన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. సైనికులు కూడా పెద్ద మొత్తంలో మరణించినట్లు తెలుస్తోంది. పలుచోట్ల అపార్ట్‌మెంట్లపై కూడా క్షిపణులుపడ్డాయి. పౌరుల మరణాలు కూడా పెద్ద సంఖ్యలో ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కీవ్‌కు 130 కిలోమీటర్ల దూరంలోని చెర్నోబిల్‌ చఅణు విద్యుత్తు ప్లాంట్‌ను రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ కూడా ధ్రువీకరించింది. ఇక కీవ్‌ సమీపంలో 14 మందితో ప్రయాణిస్తున్న సైనిక విమానం ఒకటి కూలిపోయిందని సమాచారం. మొత్తంమీద ఉక్రెయిన్‌కు చెందిన 40 మంది, రష్యాకు చెందిన 50 మంది కలిపి 90 మంది వరకు సైనికులు మొదటిరోజే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఒడెసా నగరంలో 18 మంది పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. దీనిని ఉక్రెయిన్‌ ఇంకా ధ్రువపరచలేదు.

రష్యాకు చెందిన ఐదు విమానాలను, ఒక హెలికాప్టర్‌ను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. సాధారణ ప్రజలు, జనావాసాలపై తాము దాడులు చేయడం లేదని, అది తమ లక్ష్యం కాదని రష్యా సైన్యం తెలిపింది. సైనిక స్థావరాలు, వైమానిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్‌లో సైనిక మౌలిక సదుపాయాలు పూర్తిగా తమ సామర్థ్యాన్ని కోల్పోయాయని పేర్కొంది. 'పూర్తిస్థాయి యుద్ధం'లో తమ సైనిక కమాండ్‌ స్థావరాలపై క్షిపణి దాడులు జరిగాయని ఉక్రెయిన్‌ వెల్లడించింది. కీవ్‌, ఖార్కీవ్‌, ఒడెసా, ద్నిప్రో తదితర 13 నగరాల్లోని స్థావరాలు లక్ష్యంగా రష్యా దాడులు చేసిందని తెలిపింది. 

Tags:    

Similar News