Breaking News: బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్? అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం..
UK Political Crisis: బ్రిటన్ చరిత్రలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధమైంది.
UK Political Crisis: బ్రిటన్ చరిత్రలో సరికొత్త రికార్డుకు సర్వం సిద్ధమైంది. తొలిసారి శ్వేతజాతీయేతరుడు ప్రధాని పదవిని అధిష్టించనున్నారు. ప్రధాని పదవి బరి నుంచి తప్పుకుంటున్నట్టు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. రిషి కంటే తాను వెనుకబడి ఉన్నానని స్పష్టం చేశారు. తాను పోటీ నుంచి తప్పుకోవడమే మేలని స్పష్టం చేశారు. రిషికి ఇప్పటికే 140 మంది ఎంపీలు మద్దతు పలికారు. బరిలో ఉన్న మరో అభ్యర్థి పెన్నీ మోర్డాంట్‌కు మద్దతు అంతంత మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 100 ఎంపీలు మద్దతు అవసరం. అయితే మోర్డాంట్‌కు కేవలం 30 మంది ఎంపీలే మద్దతు పలుకుతున్నారు. దీంతో ఆమె కూడా బరి నుంచి తప్పుకునే అవకాశముంది. ఇక టోరీ చీఫ్‌గా, యూకే ప్రధానమంత్రిగా రిషి సునక్‌ను అధికారికంగా ప్రకటించడమే ఆలస్యం. ఒకవేళ మోర్డాంట్ పోటీ నుంచి తప్పుకుంటే జాతినుద్దేశించి రిషి సునక్ ప్రసంగించనున్నారు. ఆ తరువాత ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారు చేయనున్నారు.
ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామాతో బ్రిటన్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రధాని పదవి రేసులో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. చివరికి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, పార్టీ ఎంపీ పెన్నీ మోర్డాంట్ ముగ్గురు పోటీ పడుతారని ప్రచారం జరిగింది. 100 మంది ఎంపీల మద్దతు బోరిస్‌కు ఉందంటూ ఆయన అనుచరులు ప్రకటించారు. అయితే ఒక్క రోజులోనే బోరిస్ జాన్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను పీఎం రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 100 మంది ఎంపీల మద్దతు తనకు లేదని స్వయంగా బోరిస్ ప్రకటించారు.
అయితే తెరవెనుక వేరే కథ జరిగింది. పోటీ నుంచి తప్పుకుని తనకు మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ రిషి సునక్‌ను, పెన్నీ మోర్డాంట్‌ను బోరిస్ జాన్సన్ కోరారట. వారు నిరాకరించడంతో గత్యంతరం లేక తప్పుకున్నట్టు ప్రచారం అవుతోంది. మొత్తంగ బోరిస్ తప్పుకోవడంతో రిషి సునక్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇక ప్రధానిగా పెన్నీ మోర్డాంట్ పోటీ చేయాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. కానీ ఇప్పటివరకు ఆమెకు కేవలం 30 మేర ఎంపీలు మాత్రమే మద్దతు ఇస్తున్నారు. బ్రిటన్ కాలమాన ప్రకారం 24న మధ్యాహ్నంలోగా ఆమె తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకపోతే అమె పోటీకి అనర్హురాలు అవుతారు. అదే జరిగితే రిషి సునక్ ప్రధానిగా ప్రకటించనున్నారు.
200 ఏళ్లకు పైగా భారత్‌ను బ్రిటన్ పాలించింది. సూర్యుడు అస్తమించని రాజ్యంగా విలసిల్లిన ఆ దేశ సర్వోన్నత పదవిని తొలిసారి భారతీయుడు అధిష్ఠించనున్నాడు. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత అరుదైన ఘట్టమిది. యూపీ పార్లమెంట్‌కు ఎందరో శ్వేతజాతీయేతరులు ఎంపికయ్యారు. కానీ ప్రధాని పదవి మాత్రం వారికి ఆమడ దూరంలోనే ఉండిపోయింది. అలాంటిది తొలిసారి ఓ భారతీయ సంతతి నేత ఆ పదవిని అధిష్టించనున్నారు. రాజు కంటే ముందే.. బ్రిటన్‌లో భారతీయుడికి పట్టాభిషేకం జరగబోతోంది. రిషి సునక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టనున్నారు. భారతీయ మూలాలున్న ఆయన బ్రిటన్‌లో ఉన్నా.. హిందూ సంప్రదాయాలను పాటిస్తారు.
బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టనున్న రిషి సునక్ మన దేశానికి స్వయాన అల్లుడు. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తికి అల్లుడు. నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తిని రిషి సునక్ వివాహమాడారు. 2009లో వారి పెళ్లి కూడా బెంగళూరులోనే వైభవంగా జరిగింది. రిషి, అక్షతా మూర్తికి ఇద్దరు కూతుళ్లు 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క ఉన్నారు. ఇక రిషి సునక్ పూర్వీకులది భారత దేశమే. యశ్విర్ సునక్, ఉషా దంపతులకు ఆయన 1980 మే 12న ఇంగ్లాండ్‌లోని హ్యాంప్‌షైర్లో జన్మించారు. యశ్విర్ పూర్వీకులు బ్రిటన్ ఆధీనంలో ఉన్న కెన్యాకు వలస వెళ్లారు. కెన్యా నుంచి ఇంగ్లాండ్‌కు చేరుకుని అక్కడే స్థిరపడ్డారు.
రిషి సునక్ ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం బ్రిటన్‌లోనే సాగింది. ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీల నుంచి డిగ్రీ పట్టాలను అందుకున్నారు. స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో చదువుకునే సమయంలోనే అక్షత మూర్తితో పరిచయం అయ్యింది. ఆ తరువాత 2001 నుంచి 2004 వరకు గోల్డ్‌మన్ సాచ్స్ బ్యాంకుకు అనలిస్టుగా పని చేశారు రిషి. ఆ తరువాత 2006లో ది చిల్డ్రన్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజ్‌మెంట్-సీఐఎఫ్‌ఎంలో భాగస్వామిగా చేశారు. 2009 దాని నుంచి తప్పుకున్నాడు. స్నేహితుడితో కలిసి 2010లో తెలెమ్ పార్టనర్స్ పేరుతో మరో కంపెనీని రిషి ప్రారంభించారు. నారాయణమూర్తి స్థాపించిన కాటమారన్ వెంచర్స్‌కు డైరెక్టర్‌గా కూడా పని చేశారు. 2014లో సునక్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కన్జర్వేటివ్ పార్టీ తరఫున రిచ్‌మండ్ నియోజకవర్గం నుంచి సుకన్ ఎన్నికయ్యారు. 2015 సాధారణ ఎన్నికల్లో 19వేల మెజార్టీతో గెలిచాడు. బోరిస్ జాన్సన్ నినదించిన బ్రెగ్జిట్ ఉద్యమానికి మద్దతు పలికాడు. 2019 జనరల్ ఎలక్షన్స్‌లో మళ్లీ బ్రిటన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈసారి బోరిస్ జాన్సన్ పట్టుబట్టి రిషి సునక్‌కు ఆర్థిక మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో రిషి సునక్ ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు.
పార్టీ గేట్ కుంభకోణం, ఇన్ఫోసిస్ రష్యాలో కొనసాగడంపై రిషిపై విమర్శలు వెల్లువెత్తాయి. భార్య అక్షతా మూర్తికి భారీగా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వడం ఇప్పటికీ ఆమె భారత పౌర సత్వాన్ని వదులుకోలేకపోవడం కూడా వివాదాస్పదమయ్యాయి. బోరిస్ రాజీనామా చేసిన తరువాత జరిగిన టోరీ లీడర్ ఎన్నికల్లో వాటినే ప్రత్యర్థులు ఎత్తి చూపించారు. అప్పట్లో రిషి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. లిజ్ ట్రస్ గెలవడంతో ఆమె ప్రధానిగా అయ్యారు,. అయితే ఆర్థిక విధానాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీంతో అమె రాజీనామా చేయాలంటూ డిమాండ్లు పెరిగాయి. అదే సమయంలో అమెకు వ్యతిరేకంగా 100 మంది సొంత పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదిపారు. దీంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
అంతేకాదు ప్రధాని పదవికి రిషినే బెటర్ అంటూ చాలా మంది ఎంపీలు బహిరంగంగానే తేల్చి చెప్పారు. లిజ్ ట్రస్‌ను ఎన్నుకుని తప్పు చేశామని పలువురు చెప్పినట్టు సర్వేలు తేల్చి చెప్పాయి. ప్రస్తుతం బ్రిటన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకున్నది. పౌండ్ విలువ దారుణంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో రషి అయితేనే దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించగలరని టోరీ ఎంపీలు నమ్ముతున్నారు. దీంతో రిషికే తమ మద్దతును తెలియజేస్తున్నారు. ఇక బ్రిటన్ ప్రధానిగా రిషి ఎన్నిక లాంఛనమే అయ్యింది. మోర్డాంట్ నిర్ణయమే ఆలస్యం ఆమె నిర్ణయం తరువాత ప్రధానిగా రిషిని అధికారికంగా ప్రకటించనున్నారు. అనంతరం జాతిని ఉద్దేశించి రిషి ప్రసంగించే అవకాశం ఉంది. ప్రమాణస్వీకారోత్సవ ముహూర్తాన్ని కూడా ఖరారు చేయనున్నారు.