Gotabaya Rajapaksa: గొటబయ రాజపక్సకు సింగపూర్‌ షాక్‌.. 15 రోజుల్లో..

*15 రోజుల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ... ఆదేశాలు జారీ చేసిన సింగపూర్‌ ప్రభుత్వం

Update: 2022-07-18 13:15 GMT

Gotabaya Rajapaksa: శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయకు షాక్‌

Gotabaya Rajapaksa: శ్రీలంకను సంక్షోభంలో ముంచిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్సకు సింగపూర్‌ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. దేశంలో 15 రోజుల కంటే ఎక్కువ ఉండొద్దంటూ తాజాగా అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 15 రోజుల తరువాత గడవును పొడిగించలేమని తేల్చి చెప్పారు. దీంతో గొటబయ రాజపక్స ఇరకాటంలో పడ్డారు. గొటబయకు ఆశ్రయం కల్పిస్తే శ్రీలంక ప్రజల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఏ దేశమూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో గొటబయ ఆశ్రయం కల్పించే దేశం కోసం వెతుకుతున్నారు. ఇప్పటికే రాజపక్స సోదరులకు ఆశ్రయం కల్పించబోమని భారత్‌ స్పష్టం చేసింది. శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని తేల్చి చెప్పింది.

కొలంబోలోని అధ్యక్షుడి నివాసాన్ని జులై 9న ముట్టడించేందుకు రావాలని ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు. దీంతో జులై 8న దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు కొలంబోకు బయలుదేరారు. ఈ సమాచారం ముందే తెలుసుకున్న గొటబయ ఇంటికి నుంచి పారిపోయారు. జులై 9న వేలాది మంది ప్రజలు అధ్యక్ష నివాస భవానాన్ని ముట్టడించారు. ప్రజల ఆగ్రహాన్ని చవిచూసిన గొటబయ జులై 13 అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే 12 అర్ధరాత్రి భార్య, ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో కలిసి కొలంబో నుంచి మాల్దీవ్‌కు పారిపోయారు. అక్కడి నుంచి 13న సింగపూర్‌కు వెళ్లిపోయారు. గొటబయకు సింగపూర్‌ ఆశ్రయం కల్పించడంపై శ్రీలంకలో నిరసనలు వెల్లువెత్తాయి.

అయితే గొటబయ రాజపక్సకు తాము ఆశ్రయం కల్పించడం లేదని సింగపూర్‌ స్పష్టం చేసింది. కేవలం ప్రైవేటు విజిట్‌పై 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపింది. ఆమేరకు తాజాగా 15 రోజుల్లో ఖాళీ చేయాలని గొటబయకు సింగపూర్‌ అధికారులు తేల్చి చెప్పారు. మరికొన్ని రోజులు అవకాశం ఇవ్వాలని గొటబయ కోరినప్పటికీ సింగపూర్‌ నిరాకరించినట్టు తెలుస్తోంది. దీంతో గొటబయ సంకటంలో పడ్డారు. ఇప్పుడు ఏ దేశాన్ని ఆశ్రయం కోరాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. మరోవైపు సింగపూర్‌లాగే లంక ప్రజల అగ్రహం చవి చూడాల్సి వస్తుందేమోనని గొటబయ వినతిని పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి.

దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. శాంతి భద్రతల పరిరక్షణకు తాత్కాలిక లంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్టు ప్రకటించారు. రణిల్‌ నిర్ణయంపై ప్రతిపక్ష నేత సాజిత్‌ ప్రేమదాస ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని రాణిల్‌ అపహాస్యం చేశారని ఆరోపించారు. శాంతికాముకుల ప్రాథమిక హక్కులను హరించడమే ఎమర్జెన్సీ అని సాజిత్‌ ప్రేమదాస మండిప్డడారు. కల్లోల లంకద్వీప దేశంలో నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో గో గొటబాయ ఆందోళనలకు 100 రోజులు పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఉద్యమంలో చనిపోయిన వారికి లంక ప్రజలు నివాళులర్పించారు. ఏప్రిల్‌ 9న రాజపక్స కార్యాలయం ఎదుట 10వేల మంది ప్రజలు ఆందోళన చేపట్టారు. 

Tags:    

Similar News