మారిషస్‌లో ప్రధాని మోదీ పర్యటన... ఉత్సవాలకు భారత యుద్ధ నౌక

Update: 2025-03-11 15:45 GMT

మారిషస్‌లో ప్రధాని మోదీ పర్యటన... ఉత్సవాలకు భారత యుద్ధ నౌక

PM Modi In Mauritius Visit: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూళం నుండి ఘన స్వాగతం లభించింది. మారిషస్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌కు ప్రధాని మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ఈ పర్యటనకు వెళ్లారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ వెళ్లిన ప్రధాని మోదీ అక్కడి ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గూళంతో భేటీ అయ్యారు. ఇద్దరూ కలిసి సర్ సీవూసగూర్ రామ్‌గూళం బొటానికల్ గార్డెన్‌లో మొక్కను నాటారు.

మారిషస్ ప్రధానితో భేటీ అనంతరం ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోఖూల్‌ను కలిశారు. ఇటీవలే మహా కుంభమేళా ముగిసిన సందర్భంగా భారత్ నుండి తీసుకెళ్లిన గంగా జలాన్ని, మఖానాను ఆయనకు బహుమతిగా అందించారు. బీహార్‌లో మఖానాకు ప్రత్యేక వంటకంగా పేరుంది. అలాగే ఆయన సతీమణికి బనారసి చీరను బహూకరించారు.

ఈ పర్యటనలోనే మారిషస్ ప్రభుత్వంతో భారత్ పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనుంది. మారిషస్ పర్యటన ఇరు దేశాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తంచేశారు. భారత్, మారిషస్ దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేలా మోదీ పర్యటన కొనసాగుతోంది.


మారిషస్‌కు భారత యుద్ధ నౌక

మారిషస్ 57వ జాతీయ దినోత్సవ ఉత్సవాలలో భారత దళాలు కూడా పాల్గొననున్నాయి. ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ఇంఫాల్ యుద్ధ నౌక, ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఆకాశ్ గంగ స్కైడైవింగ్ టీమ్ బృందాలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాయి.    

Tags:    

Similar News