Sunita Williams: మూడవసారి రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ కు మళ్లీ నిరాశే మిగిలింది. దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతా, బచ్ విల్మోర్ ను భూమిపైకి తిరిగి తీసుకువచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు ప్రయోగించిన క్రూ 10 మిషన్ వాయిదా పడింది.
అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరేందుకు క్రూ 10 మిషన్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ప్రయోగం మధ్యలోనే నిలిచిపోయింది. హైడ్రాలిక్ సిస్టమ్ లో సమస్య రావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది. సమస్యను పరిష్కరించి ఈ వారంలోనే మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది. దీంతో వ్యోమగాముల రాక మరికొన్ని రోజులు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో వారు ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల వ్యోమగాములు లేకుండానే అది భూమికి చేరుకుంది. దీంతో సునీతా, విల్మోర్ అప్పటినుంచి ఐఎస్ఎస్ లో నే ఉంటున్నారు. వారిని తీసుకువచ్చేందుకు స్పేస్ ఎక్స్ తో కలిసి నాసా పనిచేస్తోంది.