జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ హైజాక్ వెనుక ఏం జరిగింది? గతంలో ఇండియాలోనూ ట్రైన్ హైజాక్ ఘటనలు
Jaffar Express Train hijack: పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటన మొదటిది కాదు. ఇండియాలో కూడా రైళ్లు హైజాక్
Pakistan train hijack: విజయవంతంగా ముగిసిన పాక్ రైలు హైజాక్..ప్రకటించిన పాక్ ఆర్మీ జనరల్
గతంలో విమానాలు హైజాక్ అవడం చూసి ఉంటారు, బస్సులు, ఆఖరికి సముద్రంలో షిప్పులు కూడా హైజాక్ అవడం చూసి ఉంటారు. కానీ రైళ్లు హైజాక్ అవడం ఎప్పుడైనా చూశారా?
యస్... మీరు విన్నది నిజమే. రైళ్లు కూడా హైజాక్ అయిన సందర్భాలున్నాయి. నిన్న పాకిస్థాన్‌లో హైజాక్‌కు గురైన జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఘటన మొదటిది కాదు. గతంలో ఇండియాలో కూడా రైళ్లు హైజాక్ అయిన సందర్భాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా పాకిస్థాన్‌లో పట్టపగలే రైలును ఎలా హైజాక్ చేశారు, ఎందుకు చేశారు, మూవ్ అవుతున్న రైలును ఎలా కంట్రోల్ చేశారనే వివరాలు తెలుసుకుందాం. అదే నేటి ట్రెండింగ్ స్టోరీ.
పాకిస్థాన్‌లోని బెలూచిస్తాన్‌లో తిరుగుబాటు దళమైన బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి గట్టిగా పట్టున్న ప్రాంతం అది.
పొరుగునే ఉన్న ఆఫ్గనిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దులు ఆనుకున్న ఉన్న బెలూచిస్తాన్ అంతా కొండలు, లోయల మయం. ఆ కొండలు ఉత్త బండలు కాదు...భారీ మొత్తంలో బంగారం, రాగి లాంటి విలువైన నిక్షేపాలను నింపుకున్న కొండలు అవి.
అన్ని సహజ నిక్షేపాలు, గనులు ఉన్న ఆ ప్రాంతం దశాబ్దాల తరబడి వెనుకబాటుకు గురైందనే పేరుంది. వెనుకబడిన తమ ప్రాంతానికి స్వేచ్ఛ కావాలి... తమ అధికారం తమకే దక్కాలనే నినాదంతో ఉద్యమాలు జరుగుతున్నాయి.
బెలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా అందులోంచి పుట్టుకొచ్చిందే. కానీ ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులే లక్ష్యంగా అనేక హింసాత్మక ఘటనలు, దాడులకు పాల్పడుతున్న ఈ బెలూచ్ లిబరేషన్ ఆర్మీని అమెరికా, చైనా సహా అనేక దేశాలు ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చాయి.
తొలుత బెలూచిస్తాన్‌కే పరిమితమైన ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు ఆ తరువాత పాకిస్థాన్‌లోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించాయి.
రైలు పట్టాలు పేల్చి...
తాజాగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసేందుకు కొత్త ప్లాన్ చేసింది. కొండల మధ్యలోంచి రైలు ఒక సొరంగంలోకి వెళ్లే ప్రాంతాన్ని తమ దాడికి అనువుగా ఎంచుకుంది. రైలు సొరంగంలోకి వెళ్లడానికంటే కొంతదూరం ముందుగానే రైలు వస్తున్న సమయంలోనే పట్టాలను పేల్చేశారు. దాంతో రైలు పట్టాలు తప్పి ఆగిపోయింది. ఆ సమయంలో రైలులో 400 మందికిపైగా ప్రయాణికులు ఉన్నారు. వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయినప్పటికీ బెలూచ్ లిబరేషన్ ఆర్మీ దళంలో 100 మందికిపైనే ఉండటంతో వారు నిస్సహాయులుగా మిగిలిపోయినట్లు తెలుస్తోంది.
మజీద్ బ్రిగేడ్ సూసైడ్ స్క్వాడ్
బెలూచ్ లిబరేషన్ ఆర్మీలో మజీద్ బ్రిగేడ్ సూసైడ్ స్క్వాడ్ ఈ దాడికి పాల్పడింది. రైలు హైజాక్ ఘటనను తమ సూసైడ్ స్క్వాడ్ సాధించిన విజయంగా బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.
బెలూచ్ లిబరేషన్ ఆర్మీ డిమాండ్స్ ఏంటి?
బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ రైలు హైజాక్ చేసిన తరువాత పాకిస్థాన్‌కు తమ డిమాండ్స్ చిట్టా చదివి వినిపించింది. పాకిస్థాన్ మిలిటరీ ఫోర్స్ అపహరించిన ఉద్యమకారులు, రాజకీయ ఖైదీలను విడిచిపెట్టాలనేది అందులో ప్రధానమైన డిమాండ్. తమ డిమాండ్స్ నెరవేర్చడానికి 4 గంటల సమయం ఇచ్చింది. ఈ డిమాండ్స్ నెరవేర్చకుండా సైనిక చర్యకు దిగితే, తమ వద్ద బందీలుగా ఉన్న వారిని చంపేస్తామని హెచ్చరించింది.
రంగంలోకి పాకిస్తాన్ మిలిటరీ ఫోర్స్
పాకిస్తాన్ మిలిటరీకి స్వదేశంలోనే ఎదురైన అతి పెద్ద సవాల్ ఇది. సైనిక చర్యకు పాల్పడకూడదని బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరించినప్పటికీ అంతిమంగా పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీని రంగంలోకి దింపక తప్పలేదు. అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ చేపట్టి రైలు హైజాక్ అయిన 24 గంటల్లో 155 మందిని రక్షించారు. పాకిస్తాన్ మిలిటరీ జరిపిన ఈ దాడిలో 30 మంది మిలిటెంట్స్ చనిపోయినట్లు ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.
గతంలో ఇండియాలోనూ ట్రైన్ హైజాక్స్
ఇక గతంలో ట్రైన్ హైజాక్ అయిన ఘటనల విషయానికొస్తే... 2013 ఫిబ్రవరి 6న ముంబై నుండి హౌరాకు బయల్దేరిన జనశతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును బందీపోట్లు హైజాక్ చేశారు. 2001 లో జయచంద్ వైద్య అనే వ్యాపారవేత్తను కిడ్నాప్ చేసిన కేసులో ఉపేంద్ర సింగ్ అలియాస్ కబ్రా నిందితుడిగా ఉన్నాడు. ఉపేంద్రను విచారణ కోసం కోర్టుకి తీసుకొచ్చి తిరిగి రైలులో జైలుకు తీసుకెళ్తుండగా ఆయన కుమారుడు రైలును హైజాక్ చేసి విడిపించుకుపోయాడు.
2009 లో అక్టోబర్ 27న పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో 300 నుండి 400 మంది మావోయిస్టులు భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేశారు. అయితే, 20 మంది పోలీసులు, 150 మంది సీఆర్పీఎఫ్ బలగాలు ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని రైలు ప్రయాణికులను కాపాడారు.
ఇవి ఇండియాలో జరిగిన ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్స్. ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక ట్రైన్ హైజాక్ ఘటనలు ఉన్నాయి. గతంలో నెదర్లాండ్స్, డచ్, చైనా దేశాల్లోనూ ట్రైన్ హైజాక్ అయిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, ఈ అన్ని ఘటనలకంటే కాందహార్ ప్లేన్ హైజాక్ ఘటనే ఎక్కువ సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగానే గతేడాది IC 814: The Kandahar Hijack అనే వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది.