Pakistan train hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్.. కాల్పుల్లో 30 మంది మృతి
Pakistan train hijack: పాకిస్తాన్ లో వేర్పాటువాదు బలోచ్ మిలిటెంట్లు చెలరేగిపోయారు. ప్రయాణికుల రైలుపై దాడికి దిగారు. హైజాక్ చేశారు. ఆరుగురు భద్రతా సిబ్బందిని దారుణంగా చంపేశారు. అయితే ఈ సంఖ్య 30దాకా ఉండవచ్చని అనధికా సమాచారం. మిలిటెంట్ల 182 మందిని బందీలుగా పట్టుకున్నారు. వీరిలో ఎక్కువమంది భద్రతా సిబ్బందే ఉన్నారు. దాడి సమయంలో జాఫర్ ఎక్స్ ప్రెస్ లో దాదాపు 500 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కాగా పాకిస్తాన్ భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని 13 మంది మిలిటెంట్లను మట్టుబెట్టాయి. 80 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడాయి. రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతమైన క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులోని పెషావర్ కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి దిగారు. ఈ రైలు మార్గంలో 17 సొరంగాలు ఉన్నాయి. 8వ సొరంగం దగ్గర మిలిటెంట్లు ట్రాన్ కు పేల్చి జాఫర్ ఎక్స్ ప్రెస్ ను తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైలును చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రైలు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం.
భద్రతా దళాలు వెనక్కి తగ్గకపోతే బందీలందరినీ చంపేస్తామని మిలిటెంట్లు బెదిరించారు. మంగళవారం రాత్రి పాకిస్తాన్ భద్రతా దళాలు రైలు నుండి దాదాపు 80 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. బలూచ్ రాజకీయ ఖైదీలను, జాతీయ ప్రతిఘటన కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఉగ్రవాద సంస్థ తన డిమాండ్లలో పేర్కొంది. ప్రతిగా, వారు బందీలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీని కోసం వారు 48 గంటల కాలపరిమితిని నిర్ణయించారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం, భద్రతా దళాలు ప్రతీకార చర్యలో 13 మంది ఉగ్రవాదులను హతమార్చాయి.
ఉగ్రవాదులను చుట్టుముట్టడానికి భద్రతా దళాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. భారీ కాల్పులు, వైమానిక దాడులు జరుగుతున్నాయి. సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌ను పూర్తిగా భగ్నం చేశామని, సైన్యాన్ని వెనక్కి తగ్గేలా చేశామని ఉగ్రవాద సంస్థ చెబుతోంది. "మేము జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాము సైన్యం గ్రౌండ్ ఆపరేషన్‌ను ముగించాము. అయితే, పాకిస్తాన్ హెలికాప్టర్లు డ్రోన్‌ల బాంబు దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి" అని BLA నాయకులు అంటున్నారు.
రైల్వే అధికారుల ప్రకారం, రైలులోని 450 మంది ప్రయాణికులు, సిబ్బంది ఇంకా రైలుతో సంబంధాలు లేకుండా పోయారు. ఈ దాడిలో అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. పాకిస్తాన్ సైన్యం సైనికులు, వైద్యుల బృందాన్ని తీసుకెళ్లే సహాయ రైలును పంపింది. అంబులెన్స్‌లను కూడా పంపించారు, కానీ కొండలు, ముళ్లతో కూడిన భూభాగం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.