Ukraine's Ceasefire Agreement: జెలెన్‌స్కీ నిర్ణయాన్ని మెచ్చుకున్న అమెరికా... మళ్లీ వైట్‌హౌజ్‌కు ఆహ్వానించిన ట్రంప్
Ukraine's Ceasefire Agreement: జెలెన్‌స్కీ నిర్ణయాన్ని మెచ్చుకున్న అమెరికా... మళ్లీ వైట్‌హౌజ్‌కు ఆహ్వానించిన ట్రంప్
Ukraine ceasefire agreement with Russia: రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది. తక్షణమే రష్యాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన మూడేళ్ల తరువాత సౌది అరేబియాలోని జెడ్డాలో జరిగిన చర్చల్లో జెలెన్ స్కీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా ప్రతిపాదించిన నెల రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించినట్లు డోనల్డ్ ట్రంప్ సలహాదారులు తెలిపారు.
జెలెన్‌స్కీ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. ఉక్రెయిన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇటీవల ఆ దేశానికి నిలిపేసిన మిలిటరీ సాయంపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వారమే జెలెన్‌స్కీ అమెరికా వచ్చి వైట్ హౌజ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడవచ్చని అన్నారు.
ఈ కాల్పుల విరమణ శాశ్వతంగా ఉంటుందని ఆశించవచ్చా అని అమెరికా మీడియా అడిగిన ప్రశ్నకు డోనల్డ్ ట్రంప్ జవాబిచ్చారు. రానున్న కొద్ది రోజుల్లో అది సాధ్యమేనని భావిస్తున్నట్లు చెప్పారు.తను కూడా అదే కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు.
జెడ్డాలోని ఆర్నెట్ హోటల్లో ఈ శాంతి చర్చలు జరిగాయి. చర్చల అనంతరం అమెరికా సెక్రెటరీ మార్కో రూబియో మీడియాతో మాట్లాడారు. తక్షణమే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వస్తుందన్నారు. ఇకపై ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతాయని అన్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ నిర్ణయాన్ని రష్యాకు చెబుతాం. ఏదేమైనా ఇప్పుడు నిర్ణయం రష్యా చేతుల్లోనే ఉందని చెబుతూ ఇప్పుడు బంతి రష్యా కోర్టులో ఉందన్నారు.
అమెరికా ప్రతిపాదనకు ఉక్రెయిన్ ముందుకొచ్చినందున ఇకపై ఆ దేశానికి యధావిధిగా అమెరికా మిలిటరీ సాయం, నిఘా వర్గాల సమాచారాన్ని పంచుకోవడం జరుగుతుందని మార్కో రూబియో చెప్పారు.
అమెరికా - ఉక్రెయిన్ ఒప్పందం ఎంతవరకొచ్చింది...
చర్చల అనంతరం మీడియాతో జరిగిన జాయింట్ మీడియా కాన్ఫరెన్స్‌లో అమెరికా, ఉక్రెయిన్ మధ్య ఒప్పందం కూడా ప్రస్తావనకొచ్చింది. త్వరలోనే ఆ ఒప్పందాన్ని పూర్తి చేయనున్నట్లు ఇరుదేశాలు ప్రకటించాయి. జోబైడెన్ పదవీ కాలంలో గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌కు అమెరికా భారీగా మిలిటరీ సాయాన్ని అందించింది. పెద్ద మొత్తంలో ఆయుధాలు పంపించింది.
వందల కోట్ల డాలర్ల విలువైన ఆ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఉక్రెయిన్‌లోని గనుల తవ్వకాలకు అంగీకరించాల్సిందేనని ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి తీసుకొస్తోంది. ఫిబ్రవరి 28న డోనల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య జరిగిన భేటీలోనే ఈ ఒప్పందం చర్చకు రావాల్సింది. కానీ ఆ భేటీ అర్ధాంతరంగా ముగియడంతో ఒప్పందం ప్రస్తావనకు రాలేదు.
Donald Trump Vs Zelensky: అమెరికా అధ్యక్షుడితో జెలెన్‌స్కీకి అసలు గొడవ ఎందుకు జరిగింది?