అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఏం చేశారో తెలుసా?

సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గార్డెనింగ్ నిర్వహించారు. అంతేకాదు స్పేస్ వాక్ లో కూడా ఆమె రికార్డులు సృష్టించారు.

Update: 2025-03-12 08:30 GMT

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఏం చేశారో తెలుసా?

సునీతా విలియమ్స్ అంతరిక్షంలో గార్డెనింగ్ నిర్వహించారు. అంతేకాదు స్పేస్ వాక్ లో కూడా ఆమె రికార్డులు సృష్టించారు. 2024 జూన్ 5 నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్న సునీతా విలియమ్స్ ,బుచ్ విల్ మోర్ ను భూమి మీదకు రప్పించేందుకు నాసా అన్ని ఏర్పాట్లు చేసింది.

900 గంటల పరిశోధనలు చేసిన సునీతా విలియమ్స్

అంతరిక్షంలో సునీతా విలియమ్స్ 900 గంటల పాటు పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో పలు ప్రయోగాల్లో ఆమె భాగమయ్యారు. ఎనిమిది రోజుల అంతరిక్ష టూర్ 9 నెలలకు చేరుకోవడంతో ఈ సమయాన్ని ఆమె శాస్త్ర పరిశోధనలకు కేటాయించారు. అంతరిక్షంలో లెట్యూస్ మొక్కలకు నీరు పెట్టడంతో ఆ మొక్కలపై ఆమె అధ్యయనం చేశారు. ఇలా ఆమె అంతరిక్షంలో గార్డెనింగ్ పనిలో కొంత సమయం కేటాయించారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో అడ్వాన్స్ డ్ ప్లాంట్ హాబిటాట్‌లో లెట్యూస్ మొక్కలను పెంచుతున్నారు. అంతరిక్షంలో మొక్కలు, వాటి నీటి వ్యవస్థలో ఉండే సూక్ష్మజీవులపై వివిధ తేమ పరిస్థితుల ప్రభావంపై పరిశోధనలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములకు సురక్షితమైన పోషకాలు అందించే ఆహార ఉత్పత్తిని అందించేందుకు ఈ పరిశోధనలు దోహదం చేయనున్నాయి.

ప్యాక్డ్‌ బెడ్ రియాక్టర్ ప్రయోగం

ప్యాక్ట్ బెడ్ రియాక్టర్ ప్రయోగంలో కూడా సునీతా విలియమ్స్ భాగమయ్యారు.నీటి పునరుద్దరణ, ఉష్ణ నిర్వహణ, వివిధ ఇతర అవసరాల కోసం మెరుగైన రియాక్టర్లను అభివృద్ది చేయడం కోసం ఈ పరిశోధనలు చేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గురుత్వాకర్షణ ప్రభావాలు ఎలా ఉంటాయనే దానిపై ఈ ప్రయోగాల్లో వచ్చే రిజల్ట్స్ ఆధారంగా భవిష్యత్తులో నాసా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

అంతరిక్షంలో సూక్షజీవులపై పరిశోధనలు

అంతరిక్షంలో బాక్టీరియా ఈస్ట్‌తో కూడిన ఉత్పత్తి ప్రక్రియలను మైక్రోగ్రావిటీ ఎలా ప్రభావితం చేయనుందో పరిశోధిస్తున్నారు. గురుత్వాకర్షణ లేకపోవడంతో సూక్ష్మజీవుల కణాలు ఎలా అభివృద్ది చెందుతాయనే దానిపై అధ్యయనం చేస్తున్నారు. ఈ పరిశోధన ప్రభావాల ఆధారంగా అంతరిక్షంలో ఆహారం, మందుల తయారీకి సూక్ష్మజీవుల వినియోగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే భూమి నుంచి సామాగ్రి, ఇతర పరికరాలకు సంబంధించిన ఖర్చులు తగ్గించుకోవచ్చు.ఆహార పదార్ధాలను ఎక్కువ రోజులు నిల్వ చేసినప్పుడు అందులోని విటమిన్లు, పోషకాలు తగ్గుతాయి. అయితే ఇవి తగ్గకుండా ఉండేందుకు ఏం చేయాలనే దానిపై అంతరిక్షంలో ప్రయోగాలు చేస్తున్నారు.

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళ సునీతా

అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపిన మహిళగా సునీతా విలియమ్స్ రికార్డు నెలకొల్పారు. సునీతా విలియమ్స్ 600 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మార్చి 16న ఆమె భూమిపైకి తిరిగి రానున్నారు. అత్యధిక స్పేస్ వాక్ రికార్డు చేసిన మహిళగా కూడా సునీతా చరిత్ర సృష్టించారు. ఆమె 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ చేశారు.

స్పేస్ స్టేషన్ లో మెయింటైనెన్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నిర్వహణ, రిపేర్లలో సునీతా విలియమ్స్, బుచ్ విల్ మోర్ లు కీలకంగా వ్యవహరించారు. స్పేస్ సెంటర్ లో పాత పరికరాలను రీప్లేస్ చేశారు. ఐఎస్ఎస్ లో పనికిరాని వస్తువులు లేదా చెడిపోయిన వాటిని భూమి మీదకు పంపారు.

ప్రతి రోజూ వ్యాయామం

ప్రతి రోజూ అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్ చేరుకున్న రోజున ఎంత బరువున్నారో ఇప్పుడు కూడా అంతే బరువున్నారు. అంతరిక్షంలో ఎక్కువ రోజులు గడపడం ద్వారా ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా ఉండేందుకు ఆమె వ్యాయామం చేస్తారు.

Tags:    

Similar News