భార్యలు రాజేసిన చిచ్చు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
Royal Brothers: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ రాజకుటుంబంలో కలతలు తారాస్థాయికి చేరాయి.
Royal Brothers: ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ రాజకుటుంబంలో కలతలు తారాస్థాయికి చేరాయి. రెండేళ్ల నుంచి బ్రిటన్ యువ రాజుల మధ్య దూరం మరింత పెరుగతోంది. మేఘన్ పార్కెల్‌ను చిన్న రాజు హ్యారీ రాజరికాన్ని వదులుకోవడంతో రాజకుటుంబం ఇంటి పోరు రచ్చకెక్కింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న పెద్ద యువ రాజు విలియమ్, చిన్న యువ రాజు హ్యారీలు ఇప్పుడు ఎదురుపడినా ముఖాలు చాటేసుకుని వెళ్తిపోతున్నారు. యువ రాజుల భార్యలు రేపిన చిచ్చు చివరికి ఎటు దారి తీస్తుందోనని రాజ కుటుంబాన్ని అభిమానించేవారు ఆందోళన చెందుతున్నారు. సెప్టెంబరులో న్యూయార్క్ వెళ్లనున్న ప్రిన్స్ విలియమ్ సోదరుడు హ్యారీని కలుస్తారా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
సూర్యుడు అస్తమించని రాజ్యంగా బ్రిటన్ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగింది. ఆ దేశంలో రాజు అంటే ఎంతో ప్రత్యేకత. ఇప్పుడంటే పౌర ప్రభుత్వాలు వచ్చాయిగానీ రాజరిక వ్యవస్థ ఉన్నన్నాళ్లు బ్రిటన్ రాజ కుటుంబం చెప్పిందే వేదం చేసిందే న్యాయం అన్నట్టుగా ఉండేది. పౌర ప్రభుత్వం ఉన్నా రాయల్ ఫ్యామిలీకి మాత్రం ఏ లోటు లేకుండా అక్కడి ప్రభుత్వాలు చూసుకుంటాయి. అలాంటి బ్రిటన్ రాజ కుటుంబంలో ఇప్పుడు కలహాల చిచ్చు రేగింది. దివంతగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలు ఉత్తర, దక్షిణ ధ్రువాల్లా మారారు. తల్లి ప్రిన్సెస్ డయానా చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం 40 ఏళ్ల ప్రిన్స్ విలియమ్, 37 ఏళ్ల హ్యారీల మధ్య ఏళ్లు గడుస్తున్నా మనస్పర్థలు మాత్రం సమసిపోవడం లేదు. రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీస్, ఆయన భార్య మేఘన్ తప్పుకున్న తరువాత అన్నదమ్ములిద్దరూ మాటవరసకైనా పలుకరించిన సందర్భమే లేదు. విలియమ్ రాయల్ స్థాపనను స్వీకరించి మరిన్ని బాధ్యతలు చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. రాజ సంప్రదాయాలను వదులుకున్న హ్యారీ కాలిఫోర్నియాలో భార్యతో కలిసి ఉంటున్నాడు.
1997 ఆగస్టు 31న 36 ఏళ్ల బ్రిటన్ యువ రాణి డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయస్సు 15, హ్యారీ వయస్సు 12 ఏళ్లు మాత్రమే. ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూళ్లో చదువుతున్నారు. విలియమ్ పైచదువుల కోసం యూనివర్శిటీకి వెళ్లగా హ్యారీ మాత్రం మిలటరీలో చేరాడు. 2011లో ప్రిన్స్ విలియమ్ తన ప్రియురాలు కేట్ మిడేల్ టన్‌ను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అన్నదమ్ములిద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. వారి అనుబంధాన్ని చూసి అప్పట్లో రాజకుటుంబాన్ని అభిమానించేవారు సంతోషపడేవారు. 2018 వరకు అన్నదమ్ములు ఆనందంగానే ఉన్నారు. అయితే ఆ తరువాత హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ను వివాహం చేసుకోవడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఏడాదిలోనే ఆ కుటుంబంలో కలతలు రేగాయి. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో 'మా అన్నదమ్ముల దారులు వేరంటూ' హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఆ తరువాత 2020లో కుటుంబం నుంచి చిన్న రాజు హ్యారీ బయటపడ్డాడు. భార్యతో కలిసి అమెరికాకు వెళ్లిపోయాడు. దీంతో రాజ కుటుంబం రచ్చకెక్కింది.
బకింగ్‌హమ్ ప్యాలెస్‌లోని బ్రిటన్ రాజ కుటుంబంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలయ్యింది. వివాహం తరువాత రాజ కుటుంబంలోకి వెళ్లిన మేఘన్‌కు ఆదరణ కన్నా అవమానాలే ఎక్కువ అయ్యాయి. దీనికి తోడు బ్రిటన్‌లోని ఓ వర్గానికి చెందిన మీడియా కూడా మేఘన్-హ్యారీ జంటకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేశాయి. దీంతో మానసిక వేదనను భరించలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకున్నట్టు మేఘన్ ఓ ఇంటర్వ్యూలో వాపోయింది. తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేకనే బయటకు వచ్చినట్టు హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలోని కలహాలు ఏ స్థాయిలో ఉన్నాయో బయటి ప్రపంచానికి తెలిసింది. హ్యారీ, మేఘన్ చేసిన వ్యాఖ్యలతో ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత రెండు కార్యక్రమాలకు ఇద్దరూ హాజరైనా పలకరించుకోలేదు. 2021 జులైలో కెన్‌సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణకు, 2022 జూన్‌లో క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జుబ్లీ వేడుకలకు అన్నదమ్ములిద్దరూ హాజరయ్యారు. ఇద్దరూ ఎవరికి వారు ముఖం చాటేశారు.
రాజకుటుంబంలో చెలరేగిన అలజడి అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి మాత్రం స్పష్టత లేదు. అయితే ఇప్పుడు రాజకుటుంబం గురించి చర్చ ఎందుకుంటే వచ్చే నెలలో యూకేకు హ్యారీ, మేఘన్ జంట వెళ్లనున్నది. అంతేకాదు న్యూయార్క్‌కు ప్రిన్స్ విలియం కూడా వెళ్లనున్నారు. ఈ రెండు సందర్భాల్లో సోదరులు ఇద్దరు కలుస్తారా? అని బ్రిటన్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. బ్రిటన్‌ను వస్తున్న హ్యారీ-మేఘన్ జంట క్వీన్ విండ్‌సోర్ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి అత్యంత సమీపంలోనే ఉంటుంది. ఇక ఎర్త్ షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబరులోనే ప్రిన్స్ విలియమ్ న్యూయార్క్‌కు వెళ్లనున్నారు. ఆ సమయంలో హ్యారీని విలియమ్స్ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల కలయికపై బ్రిటన్ మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ అన్నదమ్ములు కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. ఆ ఇద్దరరూ కలుస్తారా? లేదా? అనేది తేలాలంటే వేచి చూడాల్సిందే.