Omicron Variant: దూసుకొస్తున్న కరోనా వైరస్ మూడో దశ ముప్పు..!
* ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్ * ఇప్పటికే పలు దేశాల్లో ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ
Omicron Variant: దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ " ఒమిక్రాన్ " ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. దీంతో అనేక దేశాలు కట్టడి చర్యల్ని కఠినంగా అమలుచేస్తున్నాయి. విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టి, పాజిటివ్‌గా తేలిన వారిని ఎక్కడిక్కడ క్వారంటైన్‌కు పంపుతున్నాయి.
కొత్త వేరియంట్ వెలుగుచూసిన దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా తదితర దేశాలపై ప్రయాణ ఆంక్షలు విధిస్తున్నాయి. పలు ఆఫ్రికా దేశాల నుంచి విదేశీయులు రావొద్దని బ్రిటన్‌తోపాటు అమెరికా, రష్యా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా ప్రకటించాయి.
బ్రిటన్‌లో తొలిసారిగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. జర్మనీలోనూ ఒకరు ఒమిక్రాన్ బారిన పడినట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా కొత్త వేరియంట్ బోట్స్‌వానా, బెల్జీయం, హాంకాంగ్‌లకు వ్యాపించింది. అనేక మ్యుటేషన్లు కల్గున్న వేరియంట్ చాలా శక్తివంతమైనదంటున్నారు శాస్త్రవేత్తలు. రెండు డోసుల టీకా తీసుకున్నవారు కూడా ఒమిక్రాన్ బారిన పడటం ఆందోళన కల్గిస్తోంది. కోవిడ్ బారిన పడిన వారికి కూడా ఇది సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు.
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలు వరుసపెట్టి తమపై ప్రయాణ ఆంక్షలు విధించడాన్ని సౌత్‌ఫ్రికా తీవ్రంగా పరిగణించింది.
ప్రపంచ సమస్యను కలిసి పరిష్కరించాల్సిన తరుణంలో కొన్ని దేశాలు బలిపశువులుగా చేస్తున్నాయని అసహనం వ్యక్తం చేస్తోంది. అటు దక్షిణాఫ్రికా నుంచి నెదర్లాండ్స్ చేరుకున్న వారిలో 61 మందికి కోవిడ్ పాజిటివ్ ఫలితం వచ్చింది. వారిని క్వారంటైన్‌కు తరలించారు.
దక్షిణాఫ్రికాలో కొత్తగా 2వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వెలుగుచూసిన తర్వాత కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండగా ఈ వేరియంట్ యువతకే ఎక్కువగా సోకుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తీవ్ర కలకలం రేపింది. అయితే వారికి సోకింది డెల్టా వేరియంట్ మాత్రమేనని పరీక్షల్లో తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.