విదేశీయులకు మరో షాక్ ఇచ్చిన ట్రంప్ సర్కార్
ట్రంప్ సర్కార్ భారతీయులకు షాకిచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోన్న యూఎస్ మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.
ట్రంప్ సర్కార్ భారతీయులకు షాకిచ్చే మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత కొంతకాలంగా హెచ్ 1బీ వీసాలపై ఆంక్షలు విధిస్తూ వస్తోన్న యూఎస్ మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. లాటరీ పద్ధతికి చెక్ చెబుతూ ప్రతిభకే పట్టం కట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో అమెరికాపై గంపెడు ఆశలు పెట్టుకునే భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా లోకల్ నినాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువస్తుంది. ఇందుకోసం హెచ్-1బీ వీసాల జారీలో ప్రస్తుతమున్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దు చేసేందుకు కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది ట్రంప్ ప్రభుత్వం. ఈ మేరకు ఫెడరల్ రిజిస్టర్‌లో నోటిఫికేషన్ పెట్టింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియజేయొచ్చని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ వెల్లడించింది.
అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండంతో స్థానికులకు అవకాశాలు లభించడం లేదని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. దీని ద్వారా స్వదేశీయులకు ఉపాధి తగ్గిపోతుందనే భావనతో ప్రతిభ ఉన్న వారికే తమ దేశంలో చోటిచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకే లాటరీ విధానాన్ని రద్దు చేసి ఇకపై వేతనాల ఆధారంగా హెచ్-1బీ వీసా జారీ చేయాలని నిర్ణయించింది. అయితే ఈ కొత్త నిబంధనలతో ఇకపై అమెరికాలో ఐటీ కంపెనీల్లో జీతాలు భారీగా పెరగనున్నాయి.
ఏటా హెచ్-1బీ వీసాల దరఖాస్తుల్లో కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల మందికి వీసాలు జారీ చేస్తుంది అమెరికా. ఇందులో చైనీయులు అధికంగా ఉండగా ఆ తర్వాత స్థానం భారతీయులది. మొత్తం హెచ్1బీ వీసాదారుల్లో మూడింట రెండొంతుల మంది భారతీయులే ఉంటారు. ఇందులో ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేసే వారే అధికం. అయితే ట్రంప్ ప్రభుత్వం తెచ్చిన ప్రతిపాదన అమల్లోకి వస్తే అమెరికా వెళ్లాలని కలలు కనే వేలాది మందిపై ప్రభావం చూపుతుంది. దాంతో పాటు హెచ్1 బీ వీసాదారు ఆధారంగా అమెరికా వెళ్లేందుకు జారీ చేసే హెచ్4 వీసాలకు కూడా పూర్తిగా చెక్ పడనుంది.
మరోవైపు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అమెరికాలో నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత ఉందని ఇప్పటికే తెలిపింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఎలక్షన్ స్టంట్‌గా హెచ్1బీ వీసాలపై ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కలిసొస్తాయో లేదో వేచి చూడాలి మరి.