కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. 2020 చివర్లో యూకేలో గుర్తించిన కరోనా కొత్త స్ట్రెయిన్ 30కిపైగా దేశాల్లో వ్యాపించింది. మరింత వేగంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. తాజాగా శనివారం వియత్నాంలో ఈ కొత్త స్ట్రెయిన్‌ను గుర్తించారు. దాంతో తక్షణమే అంతర్జాతీయ విమాన రాకపోకలపై ఆ దేశం నిషేధం విధించింది.
ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందే లక్షణం కారణంగా అత్యంత అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ఈ స్ట్రెయిన్ కారణంగా యూకేలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో కఠిన ఆంక్షలను అమలు చేయడం తెలిసిందే. అమెరికాలోనూ దాదాపు మూడు రాష్ట్రాల్లో ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు. అది మరిన్ని రాష్ట్రాలకు విస్తరించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వైరస్ స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందే కానీ, గత వైరస్ కన్నా ఎక్కువ ప్రాణాంతకం కాదని వైద్యులు అంటున్నారు. అలాగే, ప్రస్తుతం మార్కెట్లోకి రానున్న వ్యాక్సిన్లు ఈ వైరస్‌పై కూడా సమర్ధవంతంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. వైరస్‌లో జన్యు పరివర్తనాలు సహజమేనని వివరిస్తున్నారు.
బ్రిటన్‌లో రోజురోజుకు స్ట్రెయిన్ కేసుల సంఖ్య గణణీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఇప్పటి్కే విధించిన లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తామని ఆదేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు. బ్రిటన్‌లో శనివారం ఒక్కరోజే అత్యధికంగా 57,725 కేసులు నమోదయ్యాయి. సోమవారం నుంచి బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనకా టీకా పంపిణీ ప్రారంభం కానుంది. మరోవైపు మెరికాలో కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం ఏకంగా 2.77 లక్షల కేసులు నమోదయ్యాయి. అగ్రరాజ్యంలో మొత్తం మరణాలు 3.50 లక్షలకు చేరాయి. ఇప్పటికి 42 లక్షల మందికే టీకా వేశారు. టీకాకు రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.