NASA Artemis 1 Launch: మరో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టిన నాసా
NASA Artemis 1 Launch: నేడు చంద్రుడిపైకి మానవరహిత ఆర్టెమిస్-1 ప్రయోగం
NASA Artemis 1 Launch: చంద్రుడి ఉపరితలంపై మానవులను చేర్చడమే లక్ష్యంగా నాసా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యంత శక్తివంతమైన మానవరహిత రాకెట్‌ను చంద్రుడిపైకి నేడు పంపించనుంది. ఆగస్టు 29న జరగాల్సిన ఈ ప్రయోగం ఇంధన ట్యాంకులో సమస్య కారణంగా నేటికి వాయిదా పడింది. తాజాగా ఆ సమస్యలను పరిష్కరించి.. రాకెట్ ను ప్రయోగానికి సిద్దం చేశారు. దీనికి ఆస్టెమిస్ అనే పేరును పెట్టారు. ప్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ లాంచ్ సిస్టమ్ నింగిలోకి దూసూకెళ్లనుంది. నిర్దేశిత సమయం తర్వాత రాకెట్‌తో ఒరాయన్ విడిపోతుంది. చంద్రుడి దిశగా సాగే 'ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్' పథంలోకి వెళుతుంది.
ఆర్టెమిస్-1 పేరుతో అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహిస్తున్న ఈ యాత్రలో అత్యంత శక్తిమంతమైన రాకెట్, వ్యోమనౌకలు నింగిలోకి దూసుకెళతాయి. చందమామను చుట్టివచ్చే ఈ స్పేస్‌షిప్‌లో వ్యోమగాములు ఉండరు. తదుపరి ప్రయోగాలు మాత్రం మానవసహితంగానే సాగుతాయి. ఆర్టెమిస్-1 యాత్ర ఆరు వారాల పాటు సాగుతుంది.
3లక్షల 86వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిని చేరుకోవడానికి ఒరాయన్‌కు దాదాపు వారం పడుతుంది. మొదట చంద్రుడి ఉపరితలానికి పైన 100 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరుతుంది. ఆ తర్వాత 61వేల కిలోమీటర్ల దూరంలోని సుదూర కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఆ దశలో అది భూమికి 4.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అపోలో యాత్రలో ఇంత దూరం వెళ్లలేదు. ఈ దశలో ఒరాయన్‌లో వ్యోమగాములు ఉంటే భూమి, చంద్రుడిని ఒకేసారి చూడొచ్చు.
1960లలో చందమామపైకి మానవసహిత యాత్రలు నిర్వహించడానికి అమెరికా 'అపోలో' ప్రాజెక్టును చేపట్టింది. అయితే నాడు సైన్స్ పరిశోధనల కోసం కాకుండా సోవియట్ యూనియన్‌పై పైచేయి సాధించడమే లక్ష్యంగా అగ్రరాజ్యం వీటిని నిర్వహించింది. చంద్రుడిపైకి 1969లో మొదలైన మానవసహిత యాత్రలు 1972లో ముగిశాయి. ఏ యాత్రలోనూ వ్యోమగాములు మూడు రోజులకు మించి చందమామపై గడపలేదు. తాజా ప్రయోగం ద్వారా 50ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత చంద్రుడిపైకి మళ్లీ మనిషిని పంపే కార్యక్రమంలో తొలి అడుగు పడనుంది.
గతంలోలా కాకుండా ఈసారి చంద్రుడిపై శాశ్వత ఆవాసానికి పునాలు వేసేందుకు నాసా ఆర్టెమిస్ -1 ప్రయోగానికి నాసా శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కోసం 9వేల 300 కోట్ల డాలర్లు నాసా ఖర్చు చేస్తోంది. ఆర్టెమిస్ -1 ఖర్చు 400 కోట్ల డాలర్లు కాగా, 42 రోజుల యాత్రలో ఆర్టెమిస్-1 ప్రయాణించే దూరం 13లక్షల కిలో మీటర్లు ఉంటుందని నాసా తెలిపింది.