NASA: అంగారకుడిపై కీలక సమాచారం సేకరించిన నాసా

NASA: ఆర్గానిక్‌ పరమాణువులున్న బురద రాయిని.. గుర్తించిన నాసాకు చెందిన పర్సెవెరెన్స్‌ రోవర్‌

Update: 2022-09-16 13:00 GMT

NASA: అంగారకుడిపై కీలక సమాచారం సేకరించిన నాసా

NASA: అంగారక గ్రహంపై జీవాన్వేషణ కోసం పరిశోధనలు సాగిస్తోన్న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)కు చెందిన పర్సెవరెన్స్‌ రోవర్‌ కీలక ఆనవాళ్లను గుర్తించింది. జెజెరో బిలం నుంచి ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ సహా పలు నమూనాలను సేకరించింది. ఆ మాలిక్యూల్స్‌తో అంగారకుడిపై పురాతన జీవాలు ఉండొచ్చని కచ్చితంగా చెప్పలేనప్పటికీ భవిష్యత్తు పరిశోధనలకు ఇవి కీలకంగా మారనున్నాయని నాసా చెబుతోంది.

జెజెరో బిలం నుంచి ఇసుకరాయి, రాతి శిలలతో పాటు ఆర్గానిక్‌ పరమాణువులు ఉన్న బురదరాయిని రోవర్‌ గుర్తించిందని ప్రాజెక్టు శాస్త్రవేత్త కెన్‌ ఫార్లే తెలిపారు. ఈ ఆర్గానిక్‌ పరమాణువులల్లో కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ అణువులతో పాటు నైట్రోజన్‌, పాస్ఫరస్‌, సల్ఫర్‌ వంటి అణువులున్నాయి. ఈ నిర్దిష్ట అణువులు అంగారకుడిపై గతంలో జీవం ఉందని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానప్పటికీ మరో గ్రహంపై జీవాన్వేషణకు కీలక సాక్ష్యంగా మారుతాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. అంగారకుడిపై తాజాగా లభించిన ఆర్గానిక్‌ నమూనాలను మన భూమిపై పురాతన జీవాలకు సంబంధించిన శిలాజాలను సంరక్షించేందుకు ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే తాజా నమూనాలను భూమిపైకి తీసుకొచ్చిన తర్వాత లోతైన అధ్యయనం చేయాల్సి ఉందని, అప్పుడే దీనిపై ఓ కొలిక్కి రాగలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంగారుడిపైనున్న జెజెరో బిలంలో గతేడాది ఫిబ్రవరిలో పర్సెవరెన్స్‌ రోవర్‌ దిగిన సంగతి తెలిసిందే. వందల కోట్ల ఏళ్ల కిందట అక్కడ నది ప్రవహించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అందువల్ల అక్కడి శిలల్లో పురాతన జీవానికి సంబంధించిన ఆనవాళ్లు ఉండొచ్చని అంచనా. పర్సెవరెన్స్‌ సేకరించిన నమూనాలను భూమికి తీసుకురావడానికి ఐరోపా అంతరిక్ష సంస్థతో కలిసి నాసా ఈ దశాబ్దం చివర్లోగా మరికొన్ని వ్యోమనౌకలను పంపుతుంది. మొత్తం మీద 30 నమూనాలను పుడమికి రప్పించాలని భావిస్తున్నారు.

Tags:    

Similar News