NASA: చైనా తీరుపై నాసా మండిపాటు
NASA: గత కొన్ని రోజులుగా ప్రంపచాన్ని అల్లకల్లోలం చేసిన చైనా రాకెట్.. ఎట్టకేలకు హిందూ మహా సముద్రంలో కూలిపోయింది.
NASA: గత కొన్ని రోజులుగా ప్రంపచాన్ని అల్లకల్లోలం చేసిన చైనా రాకెట్.. ఎట్టకేలకు ఆదివారం తెల్లవారు జామున మాల్దీవుల సమీపంలో హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ విషయంలో చైనా వైఖరిపై అమెరికా అందరిక్ష సంస్థ నాసా మండిపడింది. రాకెట్ శకలాల విషయంలో చైనా బాధ్యతారహితంగా ఉందని, స్పేస్ ప్రయోగాల్లో నిబంధనలు సరిగా పాటించడం లేదని విమర్శించింది. దీనిపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ మాట్లాడుతూ.. అంతరిక్ష ప్రయోగాలపై చైనా అనుసరిస్తున్న విధానాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాలను చేసే దేశాలు కచ్చితంగా స్పేస్ డెబ్రిస్(శకలాలు)పై బాధ్యతవహించాలని పేర్కొన్నారు. శకలాలు నియంత్రణ కోల్పోయి భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు, భూమిపై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు.
అంతరిక్షంలో చైనా తన సత్తా చాటేందుకు సొంత స్పేస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం ఏప్రిల్ 29 రోజున లాంగ్ మార్చ్ 5బి రాకెటును అంతరిక్షంలోకి పంపింది. మ్యాడుల్‌కు చెందిన భారీ శకలం తన నియంత్రణను కోల్పోయి భూమి వైపుగా దూసుకొచ్చి అందరినీ టెన్షన్ పెట్టి హిందూ మహా సముద్రంలో కూలిపోయింది.