యుగాంతం అంటూ కొన్నేళ్లుగా జరుగుతోంది ప్రచారం ! 2012లోనే అంటూ అప్పట్లో కనిపించిన భయాలు ఇంకా కళ్లముందే కదులుతున్నాయ్. ఇలాంటి పరిస్థితుల్లో 2020 మరింత భయపెట్టడం స్టార్ట్ చేసింది. కరోనా, భూకంపాలు, పేలుళ్లు ఇలా ప్రతీ విషయం వెన్నులో వణుకు పుట్టించింది. యుగాంతమే ఇది అంటూ సోషల్ మీడియాలో రాతలు కూడా రాశారు చాలామంది ! ఐతే ఇదంతా ఉత్త ముచ్చట అని ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతోంది అనుకోండి ! ఇలాంటి సమయంలో నాసా చెప్తున్న ఓ విషయం మళ్లీ యుగాంతం అన్న విషయాన్ని తెరమీదకు తెస్తోంది.
2068లో ఓ గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని అదే జరిగితే సమస్త జీవరాశి నాశనం అవుతుందని నాసా ఓ విషయాన్ని బయటపెట్టింది. 2004లో తాము గుర్తించిన అపోఫిస్ అనే రాకాసి ఆస్టరాయిడ్ భూమిని ఢీ కొట్టే అవకాశం ఉన్నట్లు చెప్తోంది. 2004నుంచి ఈ గ్రహశకలాన్ని నాసా నిశితంగా పరిశీలిస్తోంది. అత్యాధునిక విధానాలు ఉపయోగించి దాని ప్రయాణమార్గాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు సైంటిస్టులు. 2029లో ఢీకొడుతుందని ముందు చెప్పినా ఆ అవకాశాలు 3శాతం కంటే తక్కువే అని తర్వాత క్లారిటీకి వచ్చారు. ఐతే 2068లో మాత్రం ఇది మిస్ అవదట. కచ్చితంగా ఢీకొడుతుందని చెప్తున్నారు. అప్పటివరకు తన దిశను మార్చుకుంటే చెప్పలేమని అంటున్నారు. దీంతో ఇప్పుడు జనాల్లో కొత్త భయం మొదలైంది.