Afghanistan: ప్రభుత్వ పగ్గాలు ముల్లా బరాదర్ కే..!
Afghanistan: మరో ఇద్దరికి కీలక పదవులు * దేశ ఆర్థిక వ్యవస్థ కోసమేనన్న తాలిబన్లు
Afghanistan: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల చూపు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ మీదే ఉంది. అమెరికా సైన్యం 20 సంవత్సరాల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు తాలిబన్ల వశంలోకి వెళ్లిపోయింది. అగ్రరాజ్యం తన సైనిక బలగాలను వెనక్కి తీసుకున్న అతి కొద్దిరోజుల్లోనే సత్తా చాటారు తాలిబన్లు. ఇన్ని సంవత్సరాలు పాటు ఎక్కడ ఉన్నారో.. ఎలా ఉన్నారో తెలియకుండా పోయిన తాలిబన్లు.. అమెరికా అడ్డు తొలగిపోవడంతో ఒక్కసారిగా పడగ విప్పారు. దేశాన్ని ఆక్రమించుకున్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సమాయాత్తమౌతోన్నారు.
ఇంత పగడ్బందీగా ఓ దేశాన్ని స్వాధీనం చేసుకోవడమంటే మాటలు కాదు. పైగా రెండు దశాబ్దాలుగా ఆచూకీ తెలియని స్థితికి, ఉనికి కోల్పోయిన దశకు చేరుకున్న తరువాత కూడా తమకు ఎదురుగా ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోగానే.. విరుచుకుపడటం అనేది ఏ మాత్రం అంచనాలకు అందనిది. చివరికి అమెరికా సైతం ఈ పరిణామాల పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తోంది. తాలిబన్లకు ఎవరు నాయకత్వం వహిస్తున్నారనే ప్రశ్న సహజంగా ఉత్పన్నం అయ్యేదే. తాలిబన్ల బలమైన నాయకత్వం, కరడుగట్టిన ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని పుణికి పుచ్చుకున్న లీడర్లు అతి కొద్దిమందే ఉన్నారు.
తాలిబన్ల సారథ్యంలో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వానికి అధ్యక్షుడిగా ముల్లా బరాదర్ బాధ్యతలను స్వీకరించడం దాదాపు ఖాయమైనట్టేనని తెలుస్తోంది. తాలిబన్ల నెట్‌వర్క్ చీఫ్ సిరాజుద్దీన్ హక్కాని, ముల్లా యాకూబ్, రాహ్బరి షురా వంటి కీలక నేతల సమక్షంలో బరాదర్ ఎంపిక జరగొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోవైపు తాలిబన్ అగ్ర నేతలంతా కాబూల్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైందని తాలిబన్ ప్రతినిధి వెల్లడించారు.