పార్లమెంట్‌లో రచ్చ.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు
Jordan: పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు కామనే.
Jordan: పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పరస్పర విమర్శలు కామనే. కానీ చట్టసభల హుందాను పెంచాల్సిన ప్రజాప్రతినిధులే విచక్షణ మరిచి ప్రవర్తించారు. జోర్డాన్ పార్లమెంట్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. సమాన హక్కులపై జోర్డాన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంగళవారం ఓ ప్రతిపక్ష ఎంపీ దానిని పనికిమాలిన బిల్లు అంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకొంది.
ప్రతిపక్ష ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దానికి ఆ ఎంపీ నిరాకరించడంతో రెండు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది కాస్తా చినికి చినికి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఎంపీలు తమ సీట్లలో నుంచి లేచి ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు ఎంపీలు చొక్కాలు పట్టుకుని కొట్టుకున్నారు. ఇదంతా అక్కడి మీడియా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారమైంది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరలయ్యాయి.