Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడిగా విక్రమ్‌సింఘే బాధ్యతలు
*శ్రీలంకకు 8వ అధ్యక్షుడిగా విక్రమ్‌ను ఎన్నుకున్న ఎంపీలు
Sri Lanka: శ్రీలంక అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు రణిల్ విక్రమ్‌సింఘే. లంకలో నాటకీయ పరిణామాల మధ్య మరోసారి అధ్యక్షుడి మార్పు జరిగింది. గొటబాయ రాజపక్స దేశాన్ని వదిలి పారిపోగా ఆయన వారసుడిగా రణిల్ అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టారు. శ్రీలంకలో రోజు రోజుకు పరిస్థితులు దిగజారుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయడం, ధరలను నియంత్రించడం కొత్త అధ్యక్షుడి ముందున్న అతిపెద్ద సవాళ్లు. కొన్ని నెలలుగా శ్రీలంకలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి.
పర్యాటకం మీదనే ఆధారపడిన ద్వీప దేశం ఆర్థిక పరిస్థితి కోవిడ్ వల్ల మరింత కుప్పకూలింది. పెట్రోల్, డీజిల్ తదితర నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. ఈ తీరును నిరసిస్తూ ఆందోళనకారులు అధ్యక్షుడి నివాసాన్ని చుట్టుముట్టి రచ్చ రచ్చ చేశారు. లంకేయుల దెబ్బకు రాజపక్స గొటబాయ దేశం విడిచి పారిపోయారు. తర్వాత పరిణామాలతో లంకలో ఎమర్జెన్సీ విధించడంతో పాటు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను జారీ చేశారు. మరోసారి లంకను దారికి తెచ్చేందుకు నూతన అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్‌సింఘేను ఎంపీలు ఎన్నుకోగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.