Monkeypox: వైరస్ పాతదే అన్నారు. భయం లేదు మందులున్నాయన్నారు. అది మాత్రం రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఇప్పుడేమో కొత్తగా వైరస్‌లో రెండు మార్పులు ఉన్నాయని చెబుతున్నారు. తాజాగా చిన్నారులకు కూడా వైరస్ సోకింది. ఆ వైరస్ కరోనా కాదు మంకీపాక్స్ రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులతో ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ వ్యాప్తి వేగం పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. తాజాగా అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. దీంతో పరిస్థితి తీవ్రత పెరిగినట్టు స్పష్టమవుతోంది.
చైనాలోని వ్యూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోయాయి. కంటికి కనిపించని వైరస్‌తో దాదాపు అన్ని దేశాలు పోరాడాయి. కోవిడ్ తరువాత వైరస్ అంటేనే జనం వణికిపోతున్నారు. తాజాగా మంకీపాక్స్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 75 దేశాలకు పాకిన ఈ వైరస్.. 16వేల మందికి సోకింది. ఆఫ్రికాలో మంకీపాక్స్‌తో ఐదుగురు మృతి చెందారు. అమెరికాలో తాజాగా ఇద్దరు చిన్నారులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు. అగ్రదేశంలో మొత్తం 2వేల 800 కేసులు నమోదయ్యాయి. అమెరికాకు పొరుగున ఉన్న కెనడాలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా 681 కేసులు నమోదైనట్టు కెనడా ప్రజారోగ్య సంస్థ ప్రకటించింది. ఐరోపా దేశాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లోనూ ఈ వైరస్ అడుగు పెట్టింది. మొత్తం నాలుగు కేసులు గుర్తించారు. గల్ఫ్ దేశాల నుంచి కేరళకు వచ్చిన ముగ్గురికి, ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ సోకినట్టు తేలింది.
ఆఫ్రికాలో మొదలై.. ఒక్కో దేశానికి వ్యాపిస్తున్న మంకీపాక్స్ ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. దీంతో వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కేసులు భారీగా పెరుగుతుండడంతో అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. అత్యయిక పరిస్థితిపై డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 9 మంది సభ్యుల్లో ఆరుగురు మాత్రమే ఎమర్జెన్సీకి మద్దతు తెలిపారు.అయినా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ అథనోమ్ ఎమర్జెన్సీ నిర్ణయం ప్రకటించడం గమనార్హం. యూఎన్ హెల్త్ ఏజెన్సీ చీఫ్ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. డబ్ల్యూహెచ్‌వో ఒక వ్యాధిని అత్యయిక పరిస్థితిగా ప్రకటించిందంటే.. అది అసాధారణ పరిస్థితి అని అర్థం. ఓ దేశ సరిహద్దులు దాటి ప్రమాదకర స్థాయిలో వైరస్ లేదా వ్యాధి విజృంభిస్తున్నప్పుడు మాత్రమే అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తుంది. అన్ని దేశాలు సమన్వయంతో స్పందిస్తూ వ్యాధిపై పోరాడాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపునిస్తుంది. 2005లో తెచ్చిన అంతర్జాతీయ ఆరోగ్య నిబందనల ప్రకారం.. అన్ని దేశాలు ఆరోగ్య అత్యవసర పరిస్థితిపై తక్షణమే స్పందిచాల్సి ఉంటుంది.
మంకీపాక్స్ బాధితులకు సన్నిహింతంగా మెలిగిన వారు 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది. ప్రధానంగా కోతుల్లోనే కనిపించే ఈ వైరల్ వ్యాధి అంత తేలిగ్గా మనుషుల నుంచి మనుషులకు సోకదని నిపుణులు చెబుతున్నారు. వ్యాధి బారినపడిన వారికి అత్యంత సన్నిహితంగా వెళ్లినవారికే సోకుతుందని వివరిస్తున్నారు. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా సోకుతున్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్, బెల్జియంలో స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో మంకీపాక్స్ వెలుగు నిర్ధారణ అయింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ భాగం స్వాలింగ సంపర్కుల్లోనే కనిపించడం గమనార్హం. మంకీపాక్స్ సోకిన వారితో లైంగికంగా కలిసినా ఇతరత్రా దగ్గరకు వెళ్లినా వైరస్ సోకనున్నది. వైరస‌్ సోకిన వారు.. దీర్ఘకాలికంగా వ్యాధుల బారిన పడినవారికి, గర్భిణులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మంకీపాక్స్ తొలికేసును 1950లో గుర్తించారు. పరిశోధనల నిమిత్తం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్ బయటపడింది. అయితే మనుషుల్లో మాత్రం 1970లో కాంగోలో గుర్తించారు. దీన్ని మినీపాక్స్ వైరస్ పిలుస్తారు. ఇది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆఫ్రికా ఖండంలో నమోదైన వేలాది మంకీపాక్స్ కేసులు చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వ్యాపించింది. శారీరక కలయిత ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువ. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లనొప్పులతో ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఆఫ్రికాలో తప్ప.. ఇతర దేశాల్లో ఇప్పటివరకు ఎవరూ మృతి చెందలేదు. వైరస్ బారిన పడిన వారు ఇతరులకు దూరంగా, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలనే తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
అయితే వైరస్ వేగంగా వ్యాప్తిస్తుండడమే అందరిలోనూ ఆందోళనకు కారణమవుతోంది. మంకీపాక్స్ సోకితే తీవ్రమైన నొప్పులతో బాధితులు విలవిలలాడుతున్నట్టు తాజా కేసుల్లో వైద్యులు గుర్తించారు. మంకీపాక్స్‌పై ప్రభుత్వాలు అప్రమత్తమవ్వాలని సూచిస్తున్నారు.